సూర్యాపేట ,డైనమిక్, నవంబర్ 9
ఈ నెల 15 శనివారం నాడు జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా పోలీస్ అధికారి నరసింహ పిలుపునిచ్చారు.
ఎస్పీ నరసింహ మాట్లాడుతూ
రాజీపడదగిన కేసుల్లో ఇరువర్గాల మధ్య పరస్పర అవగాహనతో పరిష్కారం కనుక్కోవడం వల్ల సమయం, ధనం, శ్రమ ఆదా అవుతుందని తెలిపారు. రాజీ ద్వారా అందరికీ న్యాయం త్వరగా లభిస్తుందని పేర్కొన్నారు.
ఏయే కేసులు రాజీకి అనువో తెలుసుకోండి
ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ పరమైన విభేదాలు, మోటార్ వాహన నిబంధనల ఉల్లంఘన, డ్రంకన్ డ్రైవ్, విద్యుత్ చౌర్యం, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ వంటి కేసులు రాజీపడదగినవని ఆయన వివరించారు.
కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేయొద్దు
చిన్న చిన్న తగాదాలపై కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేయకుండా, లోక్ అదాలత్ ద్వారా పరస్పర రాజీ చేసుకుని సమస్యలకు పరిష్కారం చూపాలని ఎస్పీ సూచించారు.
పోలీసు సిబ్బంది కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు
జిల్లాలోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం
“లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి” అని ఎస్పీ నరసింహ అన్నారు.
