డైనమిక్ న్యూస్,నరసరావుపేట, నవంబర్ 23
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ప్రకటించిన 11 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో మూడు కీలక స్థానాలు పల్నాడు జిల్లాకు కేటాయించారు. టీడీపీ, జనసేన ప్రముఖులకు ఈ పదవులు దక్కడం జిల్లాలో నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం రేపింది.
పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (PUDA) చైర్మన్‌గా చిరుమామిళ్ల మధు బాబు
మాచర్ల నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు చిరుమామిళ్ల మధు బాబు పుడా చైర్మన్‌గా నియమితులయ్యారు.2012లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మధు బాబు — మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు చీఫ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన సి.వి. నరసయ్య కుమారుడు. ఉన్నత విద్యావంతుడైన ఆయనకు ఈ పదవి దక్కడం పల్నాడులో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.
ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కే.కే. శ్రీనివాసరావు
నరసరావుపేటకు చెందిన కళ్యాణం శివ శ్రీనివాసరావు (కే.కే.)ను ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.జనసేన ఆవిర్భావం నుంచే పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడిగా, పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కే.కే. నరసరావుపేటలోని ఎస్సెస్సెఎన్ కళాశాలలో చదువుకున్నారు.
అయన తండ్రి కృష్ణమూర్తి కామర్స్ లెక్చరర్‌గా పనిచేశారు. పవన్ కళ్యాణ్‌కు అత్యంత దగ్గర నాయకుడిగా ఉండటం వల్లే ఈ రాష్ట్ర స్థాయి పదవి దక్కిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
భట్రాజు వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సరికొండ వెంకటేశ్వర రాజు
సత్తెనపల్లికి చెందిన టీడీపీ నాయకుడు సరికొండ వెంకటేశ్వర రాజు భట్రాజు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
మార్కెట్ రాజు అని ప్రముఖంగా పిలవబడే ఆయనకు ఈ పదవి లభించడంతో సత్తెనపల్లి, పరిసర ప్రాంతాల్లో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.
జిల్లాలో సంబరాలు
పల్నాడుకు వరుసగా మూడు ఉన్నత పదవులు దక్కడంతో టీడీపీ, జనసేన కార్యకర్తలు పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. నాయకులకు అభినందనలు తెలుపుతూ వారి నివాసాల వద్ద అభిమానులు భారీగా తరలి వచ్చారు.
