పాలకవీడు, మార్చి 17,డైనమిక్ న్యూస్
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం చేపడితే తక్కువ ఖర్చుతో లాభదాయకమైన దిగుబడులు పొందవచ్చని పాలకవీడు మండల వ్యవసాయాధికారి బి. కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు.
రైతులకు అవగాహన కార్యక్రమం
సోమవారం కోమటికుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయాధికారి మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందులు ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో స్థానిక వనరులతో చేసే సాగు విధానమే ప్రకృతి వ్యవసాయమని చెప్పారు.
నేల సారాన్ని పెంచే పద్ధతి
కేవీకే గడ్డిపల్లి సీనియర్ శాస్త్రవేత్త నరేష్ మాట్లాడుతూ సుభాష్ పాలేకర్ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన ఈ విధానం నేల సారాన్ని పెంచి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని అందిస్తుందని వివరించారు.
జీవామృతం వంటి పద్ధతులపై శిక్షణ
జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం, ఆచాదన (మల్చింగ్) తయారీ విధానాలు మరియు వాటి ప్రయోజనాలను రైతులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడి, నాణ్యమైన ఆహారం, నీటి పొదుపు, నేల సంరక్షణ సాధ్యమవుతాయని తెలిపారు. అలాగే పంట మార్పిడి పై కూడా రైతులకు పలు సూచనలు ఇచ్చారు.
పలువురు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో ఇఫ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారి పి. గోపి, కోమటికుంట గ్రామపంచాయతీ సర్పంచ్ వడిత్య సునీత, పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి, రైతులు లక్ష్మా, నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
