నరసరావుపేట, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 23
పేదలకు మంజూరైన గృహాల నిర్మాణంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. ఆప్షన్–3 విధానంలో ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే వదిలేసిన కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి, భవిష్యత్తులో ప్రభుత్వ పనుల్లో పాల్గొనకుండా బ్లాక్లిస్ట్ చేయాలని స్పష్టం చేశారు.
ఎస్సార్ శంకరన్ హాలులో సమీక్ష సమావేశం
సోమవారం మధ్యాహ్నం నరసరావుపేట కలెక్టరేట్లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఇళ్ల వివరాలు, నిర్మాణాల స్థితి, లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో చర్చించారు.
రిజిస్ట్రేషన్ లేని స్థలాలపై సర్వే
గ్రామాల్లో రిజిస్ట్రేషన్ పత్రాలు లేని స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తున్న వారి వివరాలను అందిస్తే, రెవెన్యూ శాఖ ద్వారా సర్వే నిర్వహించి అవసరమైన ఎన్వోసీలు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. భూమి సంబంధిత సమస్యల వల్ల ఇళ్ల నిర్మాణం ఆగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి ఇంటికి టాయిలెట్ తప్పనిసరి
ఇళ్లు మంజూరైన ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా టాయిలెట్ నిర్మించుకునేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు.
పీఎం ఆవాస్ యోజన – స్టేజ్ అప్డేషన్ పై సూచనలు
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్ బకాయిలు ఉన్నా, లబ్ధిదారుల చెల్లింపులతో సంబంధం లేకుండా స్టేజ్ అప్డేషన్ ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర పథకాల అమలులో ఎటువంటి ఆలస్యం లేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఇంచార్జ్ హౌసింగ్ పీడీ ఎన్వీ ప్రసాద్, ఈఈ శివలింగం, డీఎల్డీఓ వెంకట్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
