నల్గొండ బ్యూరో, డైనమిక్, నవంబర్ 12
నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రాష్ట్రంలో ప్రసవాల నిర్వహణలో అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
30 లక్షల వ్యయంతో వికలాంగుల ధ్రువపత్రాల కేంద్రం ప్రారంభం
బుధవారం మంత్రి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల జారీ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల తర్వాత ఎక్కువగా ప్రసవాలు జరిగేది నల్గొండ జిజిహెచ్‌లోనే. నెలకు సగటున 700 నుండి 800 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి” అని తెలిపారు.
వికలాంగుల సౌకర్యాల కోసం ఆధునిక భవనం
గతంలో ఉన్న శిబిర కేంద్రంలో సౌకర్యాల లేమి కారణంగా వికలాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి గుర్తుచేశారు.ఇప్పుడు కొత్త భవనంలో తాగునీరు, టాయిలెట్లు, ర్యాంపులు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.“ఇకపై ప్రతి వారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్టిఫికెట్లు జారీ అవుతాయి. ఇప్పటివరకు ధ్రువపత్రాలు రాని వారికి త్వరితగతిన అందజేస్తాం. ధ్రువపత్రాల ఆధారంగా పెన్షన్ అందని వారికి పెన్షన్ లభిస్తుంది” అని మంత్రి పేర్కొన్నారు.
ఆధునిక పరికరాలతో వైద్య సేవలు ఉచితంగా
ఆసుపత్రిలో అన్ని అధునాతన వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.ఇటీవలే బేబీ వార్మర్స్, లాప్రోస్కోపిక్ మిషన్ వంటి పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.“రెండు, మూడు లక్షల రూపాయల విలువ చేసే ఆపరేషన్లు కూడా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉచితంగా చేస్తున్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలి” అని ఆయన సూచించారు.
మరిన్ని సదుపాయాలకు హామీ
ఆసుపత్రికి అవసరమైన మరిన్ని సదుపాయాలను త్వరలోనే కల్పిస్తామని, అవసరమైతే ‘ప్రతీక్ ఫౌండేషన్’ ద్వారా సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.
ప్రజలు ప్రసవాల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రినే ఆశ్రయించాలని కోరారు.ఇందుకు ఆశా, అంగన్వాడీ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు, వైద్యులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.


“నల్గొండ జిజిహెచ్ రాష్ట్రంలో నంబర్ వన్”
“వైద్య సేవలలో నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలపడం మా లక్ష్యం” అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డి.ఆర్.డి.ఓ. శేఖర్ రెడ్డి, ఆర్.డి.ఓ. వై. అశోక్ రెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణ కుమారి, ఆర్.ఎం.ఓ., ఇతర అధికారులు పాల్గొన్నారు.
