రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేవొద్దు
డైనమిక్ ,నల్గొండ బ్యూరో , అక్టోబర్ 26
రానున్న రెండు నుంచి మూడు రోజులు “మొంత” తుఫాను ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆమె జిల్లా అధికారులు, ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయమై సూచనలు జారీ చేశారు.వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందులో నల్గొండ జిల్లా కూడా ఉందని కలెక్టర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిమునిగే పరిస్థితులు, వంగిన విద్యుత్ పోల్స్, కిందికి వేలాడే వైర్ల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.రైతులు తడిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని కలెక్టర్ హెచ్చరించారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని సెంటర్లకు తెచ్చి వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. తహసీల్దారులు, అధికారులు రాబోయే మూడు రోజులు తమ పని స్థానాల్లోనే ఉండాలని, ఎలాంటి సెలవులు మంజూరు కాని విషయాన్ని కలెక్టర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంతరం తనిఖీ చేస్తూ, నాణ్యత కలిగిన ధాన్యం సేకరణకు అవసరమైన లారీలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.కేంద్రాల నిర్వహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు, సస్పెన్షన్ వరకు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే కొన్న ధాన్యానికి సంబంధించి ట్యాబ్ ఎంట్రీలు ఎప్పటికప్పుడు చేయాలని సూచించారు.గ్రామ పంచాయతీ అధికారులు, కొనుగోలు ఏజెన్సీలు రైతులకు తుఫాను ప్రభావం కారణంగా ధాన్యం తడవకుండా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు.టెలికాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, డీసీఓ పత్యా నాయక్, మార్కెటింగ్ ఏడీ ఛాయదేవి తదితరులు పాల్గొన్నారు.
