డైనమిక్ న్యూస్, కారం పూడి, నవంబర్ 24
విద్యుత్ ఘాతంతో ఒకరి మృతి – మరోకరి పరిస్థితి విషమం
కారంపూడి పల్నాటి వీరుల ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు కల్లిపాడు ఉత్సవాల్లో ఆదివారం జరిగిన దుర్ఘటనపై మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన ఆచారవంతుడు పల్లపు జాల నరసింహం (45)కు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విషమంగా ఉన్న అంకారావుకు మెరుగైన చికిత్సకు ఆదేశాలు
విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో ఆచారవంతుడు అంకారావు పరిస్థితి విషమంగా ఉండటంతో, వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అతని ఆరోగ్యం నిలకడ సాధించాలని ఆకాంక్షించారు.
ఐదు రోజుల ఉత్సవాలు ఘనంగా… చివరి రోజు విషాదం
పల్నాటి వీరుల ఐదు రోజుల ఉత్సవాలు కారంపూడి వేదికగా ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయని, అయితే చివరి రోజు ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అత్యంత దురదృష్టకరమని జూలకంటి విచారం వ్యక్తం చేశారు.
కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ
మృతి చెందిన నరసింహం కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
