కారంపూడి, నవంబర్ 19, డైనమిక్ న్యూస్
పల్నాటి వీరుల పరాక్రమాన్ని స్మరించుకుంటూ నిర్వహించే వార్షిక కారంపూడి వీరారాధన ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఆయన తనయుడు సాయి వివేకానందరెడ్డి కలిసి పాల్గొన్నారు.
దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంగా అంకాళమ్మ, చెన్నకేశవస్వామి మరియు వీరుల దేవాలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం అందించారు.
పల్నాటి చరిత్ర మహోన్నతం – ఎమ్మెల్యే
మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ “పల్నాటి చరిత్ర పౌరుషానికి ప్రతీక. రోమ్ దేశం తర్వాత వీరారాధన ఉత్సవాలు ఈ స్థాయిలో జరిగేది కారంపూడిలోనే. ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు ప్రజల ఐక్యత, ధైర్యసాహసాల గుర్తు” అని అన్నారు.అలాగే,“మహాభారతాన్ని తలపించేంత గొప్పది పల్నాటి యుద్ధం. బ్రహ్మనాయుడు సమసమాజ స్థాపన కోసం చేసిన పోరాటం నేటికీ ఆదర్శం” అని ఆయన పేర్కొన్నారు.
వీరుల కొనతల పరిశీలన
వీరుల దేవాలయంలో పూజల అనంతరం, పల్నాటి యుద్ధకాలంలో యోధులు ఉపయోగించిన కొనతలను ఎమ్మెల్యే పరిశీలించారు. వీరుల పరాక్రమం, చరిత్రాత్మక సంఘటనలను ఆయన స్మరించారు.
రాష్ట్ర స్థాయి ఎడ్లపందెం ప్రారంభం
పల్నాటి ఉత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్లపందెం రెండవ రోజు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో గురజాల డీఎస్పీ జగదీష్, కారంపూడి తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి కాసిన్య నాయక్, సర్పంచ్‌లు, టీడీపీ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
