.వెల్దుర్తి, డైనమిక్ న్యూస్, నవంబర్ 24
సాగుకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చునని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం మండల పరిధిలోని శిరిగిరిపాడు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై రైతన్నా మీకోసం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో పర్యటించి, రైతన్న మీకోసం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, వ్యవసాయంలో తీసుకోవాల్సిన మెలకువలను గురించి రైతులకు వివరిస్తూ.., కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని.., రైతును రాజును చేయడం కోసమే రైతన్నా మీకోసం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. వారం రోజుల్లో రైతు స్థితిగతులను టెక్నాలజీకి అనుసంధానం చేయడనే ధ్యేయంగా అధికారులు.., కూటమి పార్టీల నాయకులు పనిచేస్తారని స్పష్టం చేశారు. రైతులను అన్నివిధాలుగా ఆదుకోవడం కోసం సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెంనాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని, వ్యవసాయాన్ని సాంకేతికతను అనుసంధానం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
రైతును రోడ్డు పాలు చేసిన ఘనుడు జగన్ రెడ్డి..!
2014 – 2019 టిడిపి ప్రభుత్వం లో రైతుకు 33 రకాల సంక్షేమ పథకాలను అందించి అక్కున చేర్చుకుందని ఎమ్మెల్యే జూలకంటి గుర్తు చేశారు. జగన్ రెడ్డి రద్దు చేసిన ప్రతి ఒక్క పథకాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి అమలు చేస్తుందని వివరించారు. సాగుకు అవసరమైన అన్ని రకాల యంత్రాలు సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. పంట గిట్టుబాటు ధరలు, ధరల స్థిరీకరణ నిధి, పంట భీమా, సబ్సిడీపై యంత్రాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.
వరికపూడిశెల నిర్మించకుంటే రాజకీయ సన్యాసమే..!
వరికపూడిశెల నిర్మించకుంటే రాజకీయ సన్యాసాన్ని తీసుకునేందుకైనా వెనకాడనని ఎమ్మెల్యే జూలకంటి భీష్మించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులుగా మారిన కీలక అనుమతులను కేంద్రంతో మాట్లాడి, లైన్ క్లియర్ చేసిందని చెప్పారు. 84 వేల ఎకరాల సాగునీటి, లక్షలాదిమందికి తాగునీటి అవసరాలను తీర్చే ఒకబృహత్తర ప్రాజెక్ట్ వరికపూడిశెల అని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కుర్రి శివారెడ్డి, కళ్ళం రామాంజిరెడ్డి,మధు యాదవ్,వజ్రం నాయక్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి, తహశీల్దార్ యు .వి.రాజశేఖర్ నాయక్, ఏవో బాలాజీ గంగాధర్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
