పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, అక్టోబర్ 28
పల్నాడు జిల్లా సత్తెనపల్లినియోజకవర్గంలోని రాజుపాలెం బాలురు బీసీ హాస్టల్‌ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమెతో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు.
పెచ్చులూడిన హాస్టల్ భవనంపై ఆందోళన
హాస్టల్ భవనం చాలా పాతదై పెచ్చులూడి ప్రమాదకరంగా మారిందని విద్యార్థులు వివరించగా, మంత్రి సవిత వెంటనే స్పందించారు.హాస్టల్‌లోని విద్యార్థులను తక్షణమే వేరే భవనానికి తరలించాలని, ఇందుకోసం అద్దెకు కొత్త భవనం తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.
నూతన భవన నిర్మాణానికి హామీ
పాత హాస్టల్ స్థానంలో కొత్త భవనం నిర్మాణం కోసం చర్యలు ప్రారంభిస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన పనులు చేపడతామని తెలిపారు.
తుఫాన్ నేపథ్యంలో హాస్టల్‌కు మూడు రోజుల సెలవు
మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో హాస్టల్‌కు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారులు మంత్రి సవితకు తెలిపారు.
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం
విద్యార్థుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల విద్యా, వసతి సౌకర్యాల మెరుగుదలకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

