Sunday, April 12, 2026
Homeతాజా సమాచారంనల్గొండలో భారీ పెట్టుబడి మోసం భగ్నం“VIPS” పేరుతో వందల కోట్లు వసూలు… “WAVE”గా మళ్లీ వల10...

నల్గొండలో భారీ పెట్టుబడి మోసం భగ్నం“VIPS” పేరుతో వందల కోట్లు వసూలు… “WAVE”గా మళ్లీ వల10 మంది అరెస్ట్… ప్రధాన నిందితులు పరారీలో

నల్గొండ బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త,ఏప్రిల్ 12

అధిక లాభాలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన భారీ పెట్టుబడి స్కామ్‌ను నల్గొండ రూరల్ పోలీసులు బట్టబయలు చేశారు. “VIPS గ్రూప్ ఆఫ్ కంపెనీస్” పేరుతో వందల కోట్ల రూపాయలు సేకరించి, తిరిగి చెల్లించకుండా మోసం చేసిన ముఠా తాజాగా “WAVE” పేరుతో మళ్లీ వల వేయడానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.

లాభాల మాయాజాలం… పెట్టుబడిదారులకు నష్టం

పుణేకు చెందిన వినోద్ తుకారాం ఖుటే 2016లో VIPS వాలెట్ యాప్‌ను ప్రారంభించి, 2018లో గ్రూప్‌గా విస్తరించాడు. సోషల్ మీడియా, ఏజెంట్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ అధిక లాభాల ఆశ చూపి ప్రజల నుంచి భారీగా డబ్బులు సేకరించాడు. అయితే, హామీ ఇచ్చిన లాభాలు, పెట్టుబడులు తిరిగి ఇవ్వకుండా మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు.

చైన్ మార్కెటింగ్ ముసుగులో మోసం

ప్రైమ్ మెంబర్‌షిప్, రిఫరల్ కమిషన్, ట్రేడింగ్, ప్రాపర్టీ, మెర్చంట్ QR వంటి పథకాల పేర్లతో ప్రజలను ఆకర్షించారు.రోజుకు ఆదాయం, నెలకు 3–5 శాతం లాభాలు, 100 శాతం క్యాష్‌బ్యాక్ వంటి అసాధ్యమైన హామీలతో పెట్టుబడులు పెట్టించారు. కొత్త సభ్యులను చేర్చుకుంటేనే లాభాలు వస్తాయని చెప్పి పిరమిడ్ స్కీమ్ తరహాలో మోసం కొనసాగించారు.

“WAVE” పేరిట మరోసారి మోసం యత్నం

ఈ నెల 11న నల్గొండలో లక్ష్మి గార్డెన్స్ సమీపంలో సమావేశమై, పాత కస్టమర్లకు ₹1 లక్ష పెట్టుబడి పెడితే పాత డబ్బులు కూడా వస్తాయని నమ్మబలికారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

10 మంది అరెస్ట్… కీలక నిందితులు పరారీ

పోలీసులు 10 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వినోద్ తుకారాం ఖుటేతో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

పలు చట్టాల కింద కేసు నమోదు

క్రైమ్ నం. 64/2025 కింద IPC 120(B), 409, 420 సెక్షన్లతో పాటు ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ నిషేధ చట్టం, డిపాజిటర్ల రక్షణ చట్టాల కింద కేసు నమోదు చేశారు.

ప్రజలకు హెచ్చరిక

తక్కువ సమయంలో అధిక లాభాలు, డబ్బు రెట్టింపు వంటి ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియా, మొబైల్ యాప్‌ల ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అనుమానాస్పద వ్యవహారాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

పోలీసులకు అభినందనలు

ఈ కేసును డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో సీఐ రాఘవరావు, ఎస్‌ఐ సైదాబాబు మరియు బృందం ఛేదించగా, జిల్లా ఎస్పీ వారిని అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments