Wednesday, January 14, 2026
Homeఅమరావతిముక్కోటికి ముస్తాబైన మంగళాద్రి నేడు జగన్మోహిని అలంకారం… ఎల్లుండి ఉత్తర ద్వార దర్శనం రెండు రోజులపాటు...

ముక్కోటికి ముస్తాబైన మంగళాద్రి నేడు జగన్మోహిని అలంకారం… ఎల్లుండి ఉత్తర ద్వార దర్శనం రెండు రోజులపాటు బంగారు శంఖం తీర్థ ప్రసాదం

డైనమిక్ న్యూస్,మంగళగిరి , డిసెంబర్ 29

మంగళగిరిలోని శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఈనెల 29, 30వ తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆలయం విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

ఈనెల 30న ఉత్తర ద్వార దర్శనం

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈనెల 30వ తేదీ తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఒక్కరోజే సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

జగన్మోహిని అలంకారంలో స్వామివారు

నేడు సోమవారం రాత్రి జాగరణ సందర్భంగా భజనలు, అన్నమయ్య సంకీర్తనలు, పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారిని జగన్మోహిని అలంకారంలో అలంకరించి పుష్పక విమానంపై ఊరేగిస్తారు. అర్ధరాత్రి అనంతరం తిరువంజనోత్సవం నిర్వహిస్తారు.

దక్షిణావృత శంఖంతో తీర్థ ప్రసాదం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా బంగారు దక్షిణావృత శంఖంతో భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1820లో తంజావూరు మహారాజు వారణాసి యాత్రలో భాగంగా మంగళగిరి ఆలయానికి బంగారు తొడుగు గల దక్షిణావృత శంఖాన్ని బహుకరించారని ఆలయ చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి రోజున ఈ శంఖంతో అభిషేకం చేసి భక్తులకు తీర్థం అందజేస్తున్నారు. ఈ శంఖం నుంచి ఓంకార నాదం వినిపిస్తుందని భక్తుల విశ్వాసం.

గ్రామోత్సవం, రెండు రోజులపాటు తీర్థం

ఈనెల 30వ తేదీ మధ్యాహ్నం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. అదే విధంగా 30, 31వ తేదీల్లో భక్తులకు బంగారు దక్షిణావృత శంఖం ద్వారా తీర్థ ప్రసాదం అందజేస్తారు. ఈ తీర్థం స్వీకరిస్తే గృహ, గ్రహ బాధలు, వ్యాధులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతున్నారు.

భక్తులకు అన్ని సౌకర్యాలు

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి కోగంటి సునీల్ కుమార్ తెలిపారు. పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశామని, క్యూలైన్లలో మజ్జిగ, మంచినీరు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.

ముక్కోటికి ఆన్‌లైన్ దర్శన సేవలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆన్‌లైన్ దర్శన టికెట్లను కూడా అందుబాటులో ఉంచినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఏపీ టెంపుల్స్ యాప్ లేదా www.aptemple.org వెబ్‌సైట్ ద్వారా టైమ్ స్లాట్ ప్రకారం టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించారు. దర్శనానికి వచ్చే సమయంలో టికెట్‌తో పాటు ఆధార్ లేదా పాన్ కార్డు ఫోటో స్టార్ట్ కాపీలు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు.
ఇతర వివరాలకు సెల్ : 85001 49595 ను సంప్రదించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments