డైనమిక్ న్యూస్, కారంపూడి, నవంబర్ 21
పల్నాటి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు శుక్రవారం మందపోరు, చాపకుడు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. సమసమాజ స్థాపన కోసం బ్రహ్మనాయుడు చేపట్టిన చాపకుడు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దేవాలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా చేస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, ఎస్పీ కృష్ణరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తదితర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
మలిదేవాదులను చీకాకుపరచాలనే నాగమ్మ యత్నాలు
కోడి పందెంలో ఓటమి తర్వాత బ్రహ్మనాయుడు నేతృత్వంలో మలిదేవాదులు మందాడికి చేరి గోసంపదతో ఆనందంగా జీవిస్తున్నారన్న సమాచారం నాయకురాలు నాగమ్మకు చేరింది. వారిని మరోసారి కష్టాల్లోకి నెట్టాలని ఆమె ప్రణాళికలు వేసింది. మొదట నలగామరాజు ఒప్పుకోకపోయినా నాగమ్మ మాటలకు ప్రభావితమై మలిదేవాదులపై శత్రుత్వం పెంచుకున్నాడు.
వీధుల పల్నీడును ప్రేరేపించిన నాగమ్మ
అర్ధవీటిలోని వీధుల పల్నీడు, గతంలో బ్రహ్మనాయుడు చేతిలో ఓడిన పగతో ఎదురు చూసే వాడు. అందుకే నాగమ్మ పిలుపుతో మలిదేవాదులపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. అందుకు ప్రతిఫలంగా మాచర్ల రాజ్యం ఇస్తామన్న హామీతో అతను మరింత ఉత్సాహం పొందాడు.
హరిదాసుల వేషంలో వ్యూహాత్మక దాడి
దామినీడు, పల్లన్న–మల్లన్న వంటి వేగులు హరిదాసుల వేషంలో మందాడిలోకి చొరబడి వ్యూహం రచించారు. గోసంపదకు కాపలాగా బ్రహ్మనాయుడు నియమించిన లంకన్నపై వీధుల పల్నీడు సైన్యంతో పాటు నలగామరాజు సేన కూడా ఎదురుదాడి జరిపింది.
లంకన్న వీరోచిత పోరాటం… చివరికి బాణవర్షంలో వీరమరణం
నలుమూలల నుండి ముట్టడించిన శత్రుసేనను లంకన్న పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యునిలాగా వీరోచితంగా ఎదుర్కొన్నాడు. పల్నీడు తలను నరికివేసిన తర్వాత చాటుమాటు నుంచి ఎగబడ్డ బాణాలకు బలై వీరమరణం పొందాడు.
కన్నమదాసు రాకతో యుద్ధం తారస్థాయి
లంకన్న మృతి వార్తను పెయ్యల పేర్నీడు బ్రహ్మనాయుడికి తెలియజేయగా, తన మానసపుత్రుడైన మాల కన్నమదాసును వెంటనే మందాడి రక్షణకు పంపించాడు. కన్నమదాసు అచంచల ధైర్యంతో నలగామరాజు సైన్యాన్ని, చెంచుల బలగాలను ఓడించి ఆలమందలను రక్షించాడు.
నేడు ఉత్సవాల్లో మందపోరు ప్రధాన ఆకర్షణ
పల్నాటి వీరచరిత్రలో కీలక ఘట్టమైన మందపోరును ప్రతీ ఏడాది ఉత్సవాల్లో పునరావృతం చేస్తారు. ఈ ఉత్సవాల మూడవ రోజుగా నేడు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది.

