డైనమిక్ ,నల్లగొండ బ్యూరో ,అక్టోబర్21
ఈ నెలాఖరుకల్లా జిల్లాలోని అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో తాత్కాలిక పనులు చేసుకునే వారందరికీ జీవిత భీమా చేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదేశించారు.మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలో కనీసం నాలుగు వేల మంది తాత్కాలిక కార్మికులకు జీవిత భీమా సౌకర్యం కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా పనులు చేసుకునే వారికి బ్యాంకుల ద్వారా రూ.2 లక్షల వరకు వివిధ రకాల భీమా సౌకర్యాలు అందిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. అమెజాన్, జొమాటో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్, డ్రైవర్లు, స్వల్పకాలిక కార్మికులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని చెప్పారు.సంవత్సరానికి కేవలం రూ.20 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని, ప్రమాదవశాత్తు మరణించినా రూ.2 లక్షలు, అంగవైకల్యం కలిగితే రూ.1 లక్ష బీమా అందుతుందని వివరించారు.మున్సిపల్ కమిషనర్లు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆయా మున్సిపాలిటీ పరిధిలో తాత్కాలిక కార్మికులందరికీ ప్రమాద భీమా వర్తింపజేసేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.బీమా చేసుకునే వారికి ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్ అవసరమని, 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారందరూ అర్హులని చెప్పారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
