డైనమిక్,మెదక్ జిల్లా, పెద్దశంకరంపేట
కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా బుధవారం పెద్దశంకరంపేట మండలమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. మహిళలు తమ గృహాల్లో తులసీమొక్కలకు, ఉసిరిచెట్లకు పవిత్రంగా పూజలు నిర్వహించి వత్తుల హోమం చేశారు. మండల కేంద్రంలోని రేణుకా ఆలయం, గురుపాదగుట్ట, భవానీమాత, విఠలేశ్వర, వేణుగోపాలస్వామి, గాయత్రీమాత ఆలయాల్లో దీపాలంకరణతో ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంది.తులసీ, ఉసిరిచెట్ల వద్ద లక్ష దీపాలు వెలిగించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వేదబ్రాహ్మణులు మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇదే సందర్భంలో మండల పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకొప్పోల్ ఉమా సంగమేశ్వర ఆలయం వద్ద భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేశారు. గొట్టిముక్కుల రాజులగుట్టపై వెలసిన శివలింగం వద్ద భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.పౌర్ణమి రాత్రి భక్తుల చేత దీపాలంకరణతో పెద్దశంకరంపేట మండలంలోని ఆలయాలు కాంతివంతంగా మారాయి.
