నల్గొండ బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త,ఏప్రిల్ 11
జాతీయ రహదారులపై అర్ధరాత్రి ఆగి ఉన్న లారీలు, భారీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా, వారిలో ఒకరు మైనర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
రూ.40 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
నిందితుల వద్ద నుంచి సుమారు 1000 లీటర్ల డీజిల్, రెండు DCM వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు, వడ్లపట్టాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
హైవేలపై గస్తీ పెంచి పట్టుకున్న పోలీసులు
ఇటీవల హైవేలపై వరుసగా డీజిల్ దొంగతనాలు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, చిట్యాల సిఐ నాగరాజు పర్యవేక్షణలో పోలీసులు గస్తీ పెంచారు.ఏప్రిల్ 10 రాత్రి చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా నిలిపిన DCM వాహనాన్ని తనిఖీ చేయగా, వడ్లపట్టాల కింద డీజిల్ క్యాన్లు దాచినట్లు గుర్తించారు. అక్కడి నుంచి 400 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకుని డ్రైవర్ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
రెండో వాహనం పట్టుకుని ముఠా మొత్తాన్ని అరెస్ట్
విచారణలో ముఠాకు చెందిన మరికొందరు సభ్యులు మరో వాహనంలో ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే గాలింపు చేపట్టి రెండో DCM వాహనాన్ని కూడా పట్టుకున్నారు. దీంతో మొత్తం ఆరుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు
పల్నాడు జిల్లా (ఆంధ్రప్రదేశ్)కు చెందిన ఈ నిందితులు గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా డీజిల్ దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
దొంగతనాల పద్ధతి ఇదే
నిందితులు రాత్రి సమయంలో హైవేలపై ఆగి ఉన్న లారీలు, ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని, డ్రైవర్లు నిద్రలో ఉన్న సమయంలో డీజిల్ ట్యాంకులు తెరిచి ఇంధనాన్ని దొంగిలించేవారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాంకుల్లో నిల్వ చేసి అక్కడి నుంచి పారిపోయేవారు.
డయల్-100 కు సమాచారం ఇవ్వండి
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ జి. రమేష్ మాట్లాడుతూ, హైవేలపై అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే డయల్-100 కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. బాధితులు వెంటనే ఫిర్యాదు చేయకపోవడం వల్ల నేరస్తులు తప్పించుకునే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.
పోలీసు సిబ్బందికి అభినందనలు
ఈ కేసును ఛేదించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో పనిచేసిన సీసీఎస్, చిట్యాల పోలీస్ సిబ్బందిని జిల్లా అధికారులు ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.

