అనంతపురం, నవంబర్ 11, డైనమిక్ న్యూస్
ఢిల్లీ పేలుళ్ల ఘటన అనంతరం అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు భద్రతా ఏర్పాట్లు బలపరచడంతోపాటు అన్ని కీలక ప్రదేశాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
విస్తృత భద్రతా చర్యలు
ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసులు ఆలయాలు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు, వాణిజ్య కేంద్రాలు, పార్కులు, రద్దీ ప్రదేశాల్లో క్షుణ్ణమైన తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీణ దళం, శునక దళం సహకారంతో ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణలో తనిఖీలు
హోంగార్డులు, కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, సీఐలు నుండి డీఎస్పీలు వరకు అందరూ తనిఖీలలో పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా
జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల్లో తనిఖీలు మరింత కఠినతరం చేశారు. వాహనాలు, సామాన్లు, పార్సిల్ లగేజీ వంటి వాటిని పూర్తిగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కి లేదా డయల్ 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే భద్రతా వ్యవస్థ మరింత బలపడుతుందని తెలిపారు.


సురక్షిత సమాజం లక్ష్యం
జిల్లా ఎస్పీ పి. జగదీష్ మాట్లాడుతూ – “ప్రజల ప్రాణ భద్రతే మా ప్రధాన ధ్యేయం. అందరూ అప్రమత్తంగా ఉండి, పోలీసులకు సహకరించాలని మనవి చేస్తున్నాం” అన్నారు.
