Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంమూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిర్లక్ష్యం సహించం ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్...

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిర్లక్ష్యం సహించం ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరిక

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 16

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకుండా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడైనా నిర్లక్ష్యం కనబడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

రిటర్నింగ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్

మంగళవారం మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న దేవరకొండ డివిజన్ పరిధిలోని రిటర్నింగ్ అధికారులు, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీవో, డీపీఓ, జెడ్పీ సీఈఓలతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె సమగ్రంగా దిశానిర్దేశం చేశారు.

గత విడతల్లో ఎదురైన లోపాలు పునరావృతం కావద్దు

మొదటి, రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కొందరు ఆర్‌ఓల నిర్లక్ష్యం కారణంగా అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తాయని గుర్తు చేసిన కలెక్టర్, ఈ విడత అలాంటి సమస్యలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో ఎలాంటి అలసత్వం చూపవద్దని ఆదేశించారు.

లోపాలు తేలితే చర్యలు తప్పవు

పోలింగ్, కౌంటింగ్ నిర్వహణలో లోపాలు గుర్తిస్తే సంబంధిత ఆర్‌ఓలు, ఎంపీడీవోలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంపీడీవోలు మరోసారి తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ కేంద్రాల లే అవుట్‌ను పరిశీలించుకోవాలని ఆదేశించారు.

పోలింగ్ సమయంలో పాటించాల్సిన నిబంధనలు

ఓటింగ్ సమయంలో పోలింగ్ బూత్‌లో ముగ్గురికి మించి ఉండరాదని, మహిళలు–పురుషులకు వేరువేరు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఓటింగ్ కంపార్ట్మెంట్‌ను కిటికీలకు దగ్గరగా ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు.

మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ తప్పనిసరి

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు తప్పనిసరిగా ఓట్ల లెక్కింపును ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 85 శాతం వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు, మిగతా కేంద్రాల్లో వీడియోగ్రఫీ చేయించాలని తెలిపారు.

కౌంటింగ్‌లో అప్రమత్తత అవసరం

కౌంటింగ్ సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే రీకౌంటింగ్‌ను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని, స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్‌ను రిటర్నింగ్ అధికారులు భద్రంగా తమ కస్టడీలోనే ఉంచుకోవాలని ఆదేశించారు. మెటీరియల్ ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకూడదని తెలిపారు.

ఫలితాల ప్రకటనలో ఆలస్యం వద్దు

కౌంటింగ్ పూర్తైన అనంతరం ఫలితాల ప్రకటనలో అనవసర జాప్యం చేయవద్దని కలెక్టర్ సూచించారు. మూడో విడత ఎన్నికల కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు జిల్లాలోని ఇతర ఆర్డీవోలు, ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయి అధికారులను ఆయా మండలాలకు నియమించినట్లు తెలిపారు.

అధికారులు పాల్గొన్నారు

ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మూడో విడత ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేశారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు మాట్లాడారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments