వాషింగ్టన్, డైనమిక్ డెస్క్, నవంబర్ 13
అమెరికాలో అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా విధానంపై ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రూపొందిస్తోంది. ఇకపై విదేశీ నిపుణులను అమెరికాలో దీర్ఘకాలిక ఉద్యోగాల కోసం కాకుండా, అమెరికన్ కార్మికులకు అత్యున్నత నైపుణ్యాలు నేర్పించేందుకు తాత్కాలికంగా మాత్రమే అనుమతించనున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు.
విదేశీ నిపుణుల రాక – అమెరికన్లకు శిక్షణ కోసం మాత్రమే
ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ బెస్సెంట్, “ఇది కేవలం నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ. గత కొన్ని దశాబ్దాలుగా ఇతర దేశాలకు తరలిపోయిన తయారీ రంగాన్ని తిరిగి అమెరికాలోనే బలోపేతం చేయడమే లక్ష్యం” అని చెప్పారు.“గత 20–30 ఏళ్లుగా మనం అత్యంత కచ్చితత్వంతో కూడిన తయారీ రంగ ఉద్యోగాలను విదేశాలకు పంపించేశాం. ఇప్పుడు మళ్లీ వాటిని తిరిగి అమెరికాలో ప్రారంభించాలంటే నైపుణ్యం అవసరం. అందుకే తాత్కాలికంగా విదేశీ నిపుణులను తీసుకురావాల్సిన అవసరం ఉంది,” అని ఆయన వివరించారు.
“3 నుండి 7 ఏళ్లలో నాలెడ్జ్ బదిలీ పూర్తవుతుంది”
ట్రంప్ ఆలోచనను వివరించిన బెస్సెంట్ మాట్లాడుతూ, “అధ్యక్షుడి దృష్టి స్పష్టంగా ఉంది. అవసరమైన నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులను మూడు, ఐదు లేదా ఏడేళ్ల కాలానికి ఇక్కడికి తీసుకురావాలి. వారు అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారు తమ స్వదేశాలకు తిరిగి వెళ్తారు. శిక్షణ పొందిన అమెరికన్లు ఆ ఉద్యోగాలను చేపడతారు” అని చెప్పారు.
“విదేశీయుల వల్ల ఉద్యోగాలు పోవు”
విదేశీయుల రాకతో అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయనే ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. “ఆ ఉద్యోగాలు ప్రస్తుతం ఒక అమెరికన్ చేయలేరు. ఎందుకంటే ఆ నైపుణ్యం మన దగ్గర లేదు. విదేశీ భాగస్వాములు వచ్చి అమెరికన్ కార్మికులకు నేర్పడం దేశానికి ఒక ‘హోమ్ రన్’ లాంటిది” అని వ్యాఖ్యానించారు.
తయారీ రంగ పునరుజ్జీవనమే లక్ష్యం
బెస్సెంట్ ప్రకారం, ఈ కొత్త హెచ్-1బీ విధానం తయారీ, సెమీకండక్టర్, నౌకా రంగాల పునరుద్ధరణకు దోహదం చేయనుంది. “అరిజోనాలో భారీ పరిశ్రమలు రాబోతున్నాయి. వీటితో అమెరికా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
లక్ష డాలర్ల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు టారిఫ్ రిబేట్
ఆర్థిక విధానాలపై మాట్లాడుతూ బెస్సెంట్, “లక్ష డాలర్ల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు 2,000 డాలర్ల టారిఫ్ రిబేట్ (సుంకాల రాయితీ) ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయి. బలమైన వాణిజ్య విధానం వల్ల లాభాలు ప్రజలకు చేరాలని ట్రంప్ కోరుకుంటున్నారు,” అని తెలిపారు.వాల్ స్ట్రీట్ (పెట్టుబడిదారులు) మరియు మెయిన్ స్ట్రీట్ (సామాన్య ప్రజలు) రెండూ సమాంతరంగా అభివృద్ధి చెందడమే ట్రంప్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
