సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 21
డిజిటల్ యుగం ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చేసినా, కనిపించని కొత్త సవాళ్లను కూడా తెచ్చిందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.నమ్మదగినట్లుగా కనిపించే నకిలీ లింకులు, పెట్టుబడి మోసాలు, వర్చువల్ వ్యసనాలు ప్రజలను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు.
బెట్టింగ్ వ్యసనం… కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది
ఆన్‌లైన్ బెట్టింగ్ చిన్న మొత్తాలతో ప్రారంభమై వ్యసనంగా మారుతుందని, అప్పుల్లో కూరుకుపోయి ప్రాణాలు తీసుకున్న సంఘటనలు పెరుగుతున్నాయని ఎస్పీ హెచ్చరించారు.“బెట్టింగ్ డబ్బు సంపాదించే మార్గం కాదు” అని పౌరులు గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
డీప్‌ఫేక్‌లు, రొమాన్స్ స్కాములు… కొత్త భయాలు
సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేసి డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి బ్లాక్‌మెయిల్ చేస్తున్న నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు.హాయ్.. హలో అంటూ మొదలయ్యే స్నేహాలు రొమాంటిక్ మోసాలకు దారితీస్తున్నాయని, ముఖ్యంగా యువత, మహిళలు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు.
“మీ గుర్తింపు నేరంలో వాడాం…” డిజిటల్ అరెస్ట్ మోసాలు
వ్యక్తిగత గుర్తింపును నేరంలో ఉపయోగించారని బెదిరిస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బు దోచుకునే మోసపూరిత కాల్స్ ఎక్కువ వుతున్నాయని ఆయన తెలిపారు.యాప్ లోన్లు, మైక్రో ఫైనాన్స్ యాప్‌లు వడ్డీపై వడ్డీ వేసి ప్రజలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయని హెచ్చరించారు.
పిల్లలపై డిజిటల్ వ్యసనాల ప్రభావం
చిన్నారులను లక్ష్యంగా చేసుకుని ప్రమాదకర గేమ్‌లు, బహుమతుల పేరుతో సమాచార దోపిడీ జరుగుతోందని చెప్పారు.రాత్రిళ్లు మొబైల్ వినియోగం పెరగడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపం, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని సూచించారు.
టెక్నాలజీ – రెండు వైపుల కలిగి ఉన్న ఆయుధం
డిజిటల్ ప్రపంచం తెచ్చిన ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే పౌరుల్లో అప్రమత్తత – అవగాహన – జాగ్రత్త తప్పనిసరి అన్నారు.“టెక్నాలజీ రెండు వైపులా పదునైన ఆయుధం… దానిని ఎలా వాడుకుంటామన్నదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది” అని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ నరసింహ ప్రజలకు యువతకు సూచనలు
అనుమానాస్పద లింకులు, సందేశాలు, కాల్స్ ఓపెన్ చేయవద్దు.ఆన్‌లైన్ బెట్టింగ్, ప్రమాదకర గేమ్‌ల జోలికి వెళ్లకండి.తల్లిదండ్రులు పిల్లల మొబైల్ వినియోగంపై పర్యవేక్షణ తప్పనిసరి.తెలియని వ్యక్తులతో సోషల్ మీడియాలో వివరాలు పంచుకోవద్దు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను పబ్లిక్‌గా ఉంచకండి.పెట్టుబడులు, ఉద్యోగ ప్రక్రియలు ధృవీకరించిన వనరుల ద్వారా మాత్రమే చేయండి.ఆన్‌లైన్‌లో డబ్బులు అడిగితే ముందుగా వ్యక్తితో మాట్లాడి ధ్రువీకరించండి.అనుమానాస్పద ప్యాకేజీలు స్వీకరించవద్దు.ఏదైనా మోసం జరిగితే వెంటనే 1930 సైబర్ సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు
