సూర్యాపేట బ్యూరో, డైనమిక్, అక్టోబర్ 31
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఆయన చివ్వేముల మండలం ఐలాపురం, సూర్య తండాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ
“మొంథా తుఫాన్ కారణంగా ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వర్షాలు ఆగినందున ఎండలకు ఆరబెట్టి, 17 శాతం తేమశాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలి” అని సూచించారు.
టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లపై పరిశీలన
ఐలాపురం ఐకేపీ కేంద్రంలో ప్రభుత్వం పంపిన టార్పాలిన్లను కలెక్టర్ పరిశీలించారు.
ఎన్ని టార్పాలిన్లు అందాయో, ప్యాడీ క్లీనర్లు ఎక్కడున్నాయో వివరాలు తెలుసుకున్నారు. రోడ్డుపై ఆరబోసిన ధాన్యం తేమశాతాన్ని తేమ కొలిచే యంత్రంతో స్వయంగా పరీక్షించారు.
రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడిన కలెక్టర్
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రైతులతో మాట్లాడి ఎకరాకు ఎంత దిగుబడి వస్తోందో, కోత పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకున్నారు.ఐలాపురం కేంద్రం నుంచి శనివారం కనీసం ఒక లారీ ధాన్యాన్ని మిల్లులకు పంపేలా చర్యలు తీసుకోవాలని సెంటర్ ఇన్చార్జ్‌ను ఆదేశించారు.అలాగే మిల్ ట్యాగింగ్‌ను ఆన్లైన్‌లో ట్యాబ్ ద్వారా పరిశీలించి, హమాలీల వివరాలు, ట్యాబ్ ఎంట్రీలపై అధికారులను ప్రశ్నించారు. పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి మిల్ ట్యాగింగ్‌పై సమీక్ష నిర్వహించారు.
రికార్డులు, లెక్కలు సక్రమంగా ఉండాలి
తర్వాత సూర్య తండా కొనుగోలు కేంద్రంలో రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమశాతం కూడా స్వయంగా పరీక్షించారు.“తగిన తేమశాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు పంపించండి. రిజిస్టర్లు, లెక్కలు ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలి,” అని సెంటర్ ఇన్చార్జీలకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో సంతోష్ కుమార్, ఏపిఎం వెంకయ్య, మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, కొనుగోలు కేంద్రం ఇన్చార్జీలు శ్రీనివాసులు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు



