డైనమిక్ డెస్క్,అమరావతి, అక్టోబర్ 23
అదానీ డేటా సెంటర్ ప్రాజెక్టు రాష్ట్రానికి రావడం వెనుక తమ ప్రభుత్వ కృషి కీలకమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. “2020లోనే అదానీ డేటా సెంటర్‌తో ఒప్పందం చేసుకున్నాం. అనంతరం శంకుస్థాపన కూడా మేమే చేశాం. అదానీ, వైసీపీ ప్రభుత్వం, కేంద్రం – ఈ మూడింటి కృషి లేకపోతే గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్‌కు రాదని స్పష్టంగా చెప్పాలి,” అని వైఎస్ జగన్ తెలిపారు.ఉద్యోగుల సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్ అన్నారు: “మా ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకు 11 డీఏలు ఇచ్చాం. పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవులు నాలుగు మాత్రమే పెండింగ్‌లో పెట్టాం. మేం ప్రవేశపెట్టిన జీపీఎస్ పథకాన్ని కేంద్రం సహా పలు రాష్ట్రాలు ప్రశంసించాయి. కానీ ఇప్పుడు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు, ఐఆర్ లేదు, పీఆర్సీ గురించిన చర్చే లేదు. మేము అమలు చేసిన పీఆర్సీని రద్దు చేసి ఇప్పటివరకు కొత్తది వేయలేదు. కనీసం ఉద్యోగులకు సమయానికి జీతం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
