నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,నవంబర్ 17
మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో రూ.171.5 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు.
రూ.171.5 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం
శెట్టిపాలెం–అవంతిపురం నాలుగు లైన్ల రహదారి నిర్మాణం — రూ.74 కోట్లు,టీఎఫ్యూడీఎఫ్సీ నిధులతో రహదారులు — రూ.15 కోట్లు,సీసీ రోడ్లు, మురికికాలువల పనులు — రూ.16 కోట్లు,మున్సిపాలిటీ పరిధిలో బీటీ–సీసీ రోడ్లకు — రూ.41 కోట్లు,మిర్యాలగూడ–తడకమళ్ల ఆరు లైన్ రహదారి — రూ.15 కోట్లు,ఫ్లైఓవర్, సుందరీకరణ పనులు — రూ.3 కోట్లు కేఎన్ఎమ్ డిగ్రీ కళాశాలలో రూ.5 కోట్లతో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.2.25 కోట్లతో నిర్మించిన అదనపు భవనాలను మంత్రులు ప్రారంభించారు.
నీటిపారుదల రంగంలో భారీ కేటాయింపులు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ—
మిర్యాలగూడ మెయిన్ కెనాల్ లైనింగ్‌కు రూ.57 కోట్లు,దుబ్బతండ, శాంతినగర్, రావులపెంట చెక్డాంలకు రూ.24 కోట్లు,ఫీడర్ చానళ్లకు రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.సాగునీరు అందించే ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కొనసాగుతున్న ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. రేషన్ కార్డులు, ధాన్యం కొనుగోలు — ప్రభుత్వం భరోసా అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని 72 గంటల్లోపే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి వివరించారు. ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన ప్రభుత్వం త్వరలో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు.
ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ—
రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడూలేని విధంగా రహదారి విస్తరణ చేస్తున్నట్లు తెలిపారు.మిర్యాలగూడలో రూ.250 కోట్లు విలువైన హ్యాం రోడ్లు మంజూరు చేశామని,ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి డబుల్ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. నాగార్జునసాగర్‌కు రూ.450 కోట్లు,దేవరకొండకు రూ.350 కోట్ల హ్యాం రోడ్ల టెండర్లు పిలవనున్నట్టుచెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా రూ.65 వేల కోట్లతో భారీ రహదారి విస్తరణ చేపట్టినట్టు వివరించారు.
ప్రజా సేవా కార్యక్రమాలు, స్థానిక నాయకుల స్పందన
స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హ్యాం రోడ్ల మంజూరుకు కృతజ్ఞతలు తెలిపారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు శ్రీనివాస్ ఆసుపత్రి కోసం రూ.25 లక్షల ఫ్రీజర్ బాక్స్ ఏర్పాటు నిమిత్తం చెక్కును మంత్రులకు అందజేశారు.
అధికారుల స్వాగతం — కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు
హెలిప్యాడ్ వద్ద కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంత్రులను పుష్పగుచ్ఛాలతో ఆహ్వానించారు. అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీ రాజశేఖర్ రాజు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
