డైనమిక్, పాలకవిడు అక్టోబర్ 31
మోన్తా తుఫాన్ కారణంగా పాలకవీడు మండలం పరిధిలో బోత్తలపాలెం, అలింగాపురం, గుండ్లపాడు గ్రామాల పరిధిలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పంట నష్టాన్ని సిపిఎం మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ నాయకులతో కలిసి శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.
పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అవసరం
తుఫాన్ ప్రభావంతో వరిధాన్యం, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగి పూర్తిగా నాశనం కావడం రైతాంగాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అనంత ప్రకాష్ తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి తుఫాన్ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ఆయన వాపోయారు.
ఎకరాకు ₹30,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్
రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్న దృష్ట్యా ప్రభుత్వం వెంటనే వ్యవసాయ అధికారులచే పంట నష్టాన్ని అంచనా వేయించి, ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
తుఫాన్ ముంచేసిన రైతాంగం
“పది రోజుల్లో పంట కోసి ధాన్యం అమ్మి కొంత ఉపశమనం పొందాలని రైతులు ఆశించారు. కానీ తుఫాన్ ఆ ఆశలన్నీ నీటమునిగించింద” ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వడ్డే సైదయ్య, ఆర్లపూడి వీరభద్రం, వడ్డే వీరయ్య, ఎగిటి కొండలు, అత్తి సైదయ్య, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
