సూర్యాపేట బ్యూరో, డిసెంబర్ 23 ,డైనమిక్ న్యూస్
సాంకేతిక యుగంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులకు అధిక లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా కృషి వికాస కేంద్రం (కేవీకే) గడ్డిపల్లి నిరంతరం పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.జాతీయ రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కేవీకే – శ్రీ అరబిందో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా – వ్యవసాయ ప్రదర్శనను అటారి డైరెక్టర్ షేక్ మీరాతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
సాగునీటి వసతులతో సన్న బియ్యానికి భారీ డిమాండ్
ఎన్‌ఎస్‌పీ, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, మూసి, పాలేరు ప్రాజెక్టుల ద్వారా సూర్యాపేట జిల్లాకు పుష్కలంగా సాగునీరు అందుతోందని, దీని వలన జిల్లాలో పండే నాణ్యమైన సన్న బియ్యానికి రాష్ట్రవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని కలెక్టర్ తెలిపారు.ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు.
పత్తి సాగులో అధిక సాంద్రత విత్తన పద్ధతి
జిల్లాలో సుమారు 80 వేల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోందని, పత్తి పంటలో అధిక సాంద్రత విత్తన పద్ధతి అనుసరిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు.ప్రత్యామ్నాయ పంటలతో తక్కువ సమయంలో లాభాలుసంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా పామ్ ఆయిల్ సాగు, కూరగాయలు, పండ్ల తోటలు, మల్టీ క్రాపింగ్ వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లితే తక్కువ సమయంలోనే మంచి లాభాలు పొందవచ్చని తెలిపారు.వానలు ప్రారంభమయ్యే ముందు మట్టి పరీక్షలు చేయించుకొని, వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని సాగు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
డ్రమ్ సీడ్ విధానంతో ఖర్చుల తగ్గింపు
కూలీల కొరతను అధిగమించేందుకు డ్రమ్ సీడ్, నేరుగా విత్తే పద్ధతి ద్వారా వరి సాగు చేయడం వల్ల ఖర్చులు తగ్గుతాయని తెలిపారు.10 ఎకరాలను ఒక్క రైతు సాగు చేసి లాభాలు పొందగలిగితేనే వ్యవసాయం నిజమైన ఆదాయ వనరుగా మారుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.ఎఫ్‌పీఓలతో రైతులకు ప్రభుత్వ సబ్సిడీ డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి ఆదాయం పెంచుకునేలా కేవీకే ద్వారా రైతులకు మరింత అవగాహన కల్పించాలని, రైతులంతా కలిసి ఎఫ్‌పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) ఏర్పాటు చేస్తే ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుందని తెలిపారు.
బయో ఫోర్టిఫైడ్ రైస్‌తో పోషక భద్రత
అటారి డైరెక్టర్ షేక్ మీరా మాట్లాడుతూ,
తక్కువ ఖర్చుతో అధిక లాభాలు ఇచ్చే విధంగా వరి సాగుపై కేవీకే శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.బయో ఫోర్టిఫైడ్ రైస్ సాగు చేయడం ద్వారా ఆహార భద్రతతో పాటు పోషక భద్రత కూడా లభిస్తుందని తెలిపారు.సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చని, ఉద్యానవన పంటలు, వ్యవసాయ యాంత్రికరణ, పంట ప్రాసెసింగ్ ద్వారా అధిక లాభాలు సాధ్యమని పేర్కొన్నారు.
మహిళా రైతులు ముందుకు రావాలి
మహిళా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని,అధిక సాంద్రత పత్తి సాగుతో ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి సాధ్యమవుతుందని తెలిపారు.సన్న, చిన్న రైతులు దేశీయ కోళ్ల పెంపకం ద్వారా తక్కువ ఖర్చుతో అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు.
నూతన వంగడాల అందుబాటుకు సహకారం
తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్ మురగన్ మాట్లాడుతూ,కేవీకే గడ్డిపల్లికి నూతన సాగు పద్ధతులు, నూతన వంగడాలు అందించేందుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.మహిళా రైతులు ఎస్‌హెచ్‌జీలు, ఎఫ్‌పీఓల ద్వారా బృందాలుగా ఏర్పడి వ్యవసాయం చేస్తే అధిక లాభాలు పొందవచ్చని అన్నారు.
రైతులకు పరికరాల పంపిణీ, సన్మానం
ఈ సందర్భంగాగోపాలపురం గ్రామానికి చెందిన వినోద్‌కు డ్రమ్ బెల్లం,మేడారం గ్రామానికి చెందిన ముక్కంటికి డ్రమ్ సీడ్ యంత్రం,మంగళ తండా గ్రామానికి చెందిన బాలునాయక్‌కు బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్,గుగులోత్తు శ్రీరాములకు టమాటా, వంగ నారు అందజేశారు.అలాగే నూతన పద్ధతులతో వ్యవసాయం చేస్తున్న రైతులను కలెక్టర్, అటారి డైరెక్టర్ ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు.
అధికారులు, రైతుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలోడీఏఓ శ్రీధర్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి నాగయ్య,అటారి ప్రిన్సిపల్ శాస్త్రవేత్త ఏ.ఆర్.రెడ్డి,కేవీకే గడ్డిపల్లి సీనియర్ శాస్త్రవేత్త నరేష్,అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
