సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్8
నకిలీ బంగారం విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను సూర్యాపేట రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను పట్టుకొని రూ.12 లక్షల నగదు, ఐదు నకిలీ బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ హెచ్చరిక
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ కేసు వివరాలు వెల్లడించారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటే నమ్మవద్దని, అటువంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
వాహన తనిఖీల్లో పట్టుబాటు
బాలెంల గ్రామ శివారులో ఖమ్మం జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మోసం చేసి డబ్బులు వసూలు
తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పి బాధితులను నమ్మించి రూ.12 లక్షల నగదు వసూలు చేసినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసు బృందానికి అభినందన
కేసును ఛేదించిన సూర్యాపేట రూరల్ సీఐ జి.రాజశేఖర్, ఎస్సై ఎన్.బాలు నాయక్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
