సూర్యాపేట బ్యూరో, నవంబర్ 11 , డైనమిక్ న్యూస్
సైబర్ మోసగాళ్లు ఇప్పుడు పోలీసు అధికారుల పేర్లను కూడా దుర్వినియోగం చేస్తున్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. తన పేరుతో “ఎస్‌పీ సూర్యాపేట (SP Suryapet)” పేరున ఒక నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ సృష్టించి, ప్రజలకు సందేశాలు పంపుతున్నారని ఆయన చెప్పారు.
మోసం చేసేందుకు కొత్త పద్ధతులు
ఆ అకౌంట్ ద్వారా కొంతమందికి వ్యాపారం పేరుతో పెట్టుబడులు పెట్టమని, కొందరికి డబ్బు అడిగే ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్పీ వివరించారు. ఇది పూర్తిగా మోసపూరిత చర్య అని, ఎవరూ అలాంటి సందేశాలకు స్పందించవద్దని హెచ్చరించారు.
ప్రజల సహకారం కోరిన ఎస్పీ
నకిలీ అకౌంట్‌ను ఫేక్‌గా గుర్తించి రిపోర్ట్ చేయాలని ఎస్పీ పౌరులను కోరారు. ఆ ప్రొఫైల్ లింక్‌ను ప్రజలు గుర్తించి తమ ఖాతాల నుండి రిపోర్ట్ చేయాలని, తద్వారా ఆ అకౌంట్‌ను అడ్డుకోవచ్చని సూచించారు.
అధికారిక అకౌంట్ ఇదే
జిల్లా పోలీస్ అధికారిక ఖాతా పేరు SP Suryapet అని, దానికి గల గుర్తు “✅” అని ఆయన స్పష్టంచేశారు. ఇతర సమాన పేర్లతో ఉన్న ప్రొఫైళ్లు నకిలీగా పరిగణించాలన్నారు. “సామాజిక మాధ్యమాల్లో మోసగాళ్లకు అవకాశం ఇవ్వకండి. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది,” అని ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు.
