సైబర్ జాగరుకత దివస్ సందర్భంగా విద్యార్థినులకు అవగాహన సదస్సు
నల్లగొండ బ్యూరో, డైనమిక్,నవంబర్6
నల్లగొండ పట్టణంలోని దీప్తి నర్సింగ్ కళాశాలలో గురువారం సైబర్ జాగరుకత దివస్ సందర్భంగా విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పోలీస్ అధికారి శరత్ చంద్ర పవార్, ప్రజలందరూ సైబర్ మోసాల నుండి రక్షించుకునేందుకు తగిన అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తున్న సైబర్ నేరగాళ్లు
ఎస్పీ మాట్లాడుతూ, “ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేలాది మంది సైబర్ మోసాలకు గురవుతున్నారు. డబ్బులు పోయిన తర్వాత బాధపడటం కంటే ముందుగానే జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం” అన్నారు.కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసే పద్ధతులు మారుతున్నాయని పేర్కొన్నారు. చదువుకున్న యువత ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉంటే, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగు వారిని కూడా చైతన్యపరచగలరని తెలిపారు.
అప్రమత్తంగా ఉండకపోతే నష్టం తథ్యం
ప్రస్తుత కాలంలో ఎక్కువగా జరిగే సైబర్ నేరాలుగా APK ఫైల్స్ మోసాలు, జంప్డ్ డిపాజిట్ స్కీమ్‌లు, డిజిటల్ అరెస్టు మోసాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లు, సైబర్ బుల్లింగ్ వంటి వాటిని పేర్కొన్నారు.“అపరిచిత లింకులు, మెసేజ్‌లు, వాట్సాప్ లేదా ట్విట్టర్ ద్వారా వచ్చే బ్లూ కలర్ లింక్స్ క్లిక్ చేయకూడదు. వాటి ద్వారా ఫోన్ హ్యాక్ అవ్వడం, డబ్బులు పోవడం వంటి ప్రమాదాలు ఉన్నాయి” అని హెచ్చరించారు.
ఓటీపీ లేదా లింకులు అడిగే కాల్స్‌కి మోసపోవద్దు
బ్యాంకు అధికారులు ఎప్పుడూ ఓటీపీ లేదా లింకులు అడగరని ఎస్పీ స్పష్టం చేశారు.“ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలి. ఏ అనుమానం ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదు,” అని సూచించారు.
మోసానికి గురైతే వెంటనే 1930 కి ఫిర్యాదు చేయాలి
సైబర్ నేరాలకు గురైన వారు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని, లేదా www.cybercrime.gov.in (NCRP పోర్టల్) ద్వారా ఫిర్యాదు చేస్తే, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు వెంటనే స్పందిస్తారని తెలిపారు.“సమయానికి సమాచారం అందిస్తే పోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది” అని అన్నారు.


కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్‌బీ సీఐ రాము, 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐ విష్ణు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
