బాపట్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 24
- పర్యావరణ అనుమతులు, వాల్టా చట్టం ఆధారంగా ఇసుక రేవులు అనుమతించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.
కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో ఇసుక లభ్యత ఉందని కలెక్టర్ చెప్పారు. కొల్లూరు మండలం జువ్వలపాలెం ఇసుక రేవులో 14.960 హెక్టార్ల ఇసుక లభ్యత ఉందని స్పష్టం చేశారు. స్థానికుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ తదుపరి ఆ ప్రాంతం నుంచి ఇసుక తవ్వడానికి అనుమతి ఉంటుందన్నారు. ప్రజా అభిప్రాయ సేకరణ నిబంధన అనుసరించి వేగంగా చేపట్టాలన్నారు. ఓలేరు రేవులో ఇసుక తవ్వకాలు జరపడానికి ముందస్తు పరిశీలన చేయాల్సి ఉందన్నారు. నూతనంగా కొల్లూరు మండలంలోని చిలుమూరు, గాజుర్లంక వద్ద మూడు రేవులను గుర్తించామని చెప్పారు. సాంకేతిక నిపుణులు, కమిటీలోని ఆయా శాఖల అధికారులు కలిసి క్షేత్రస్థాయి పరిశీలన తదుపరి అనుమతులు ఇవ్వాల్సి ఉందన్నారు. తాజాగా గుర్తించిన చిలుమూరు ఇసుక రేవులో 4.9 హెక్టార్లలో ఇసుక లభ్యత ఉందన్నారు. అలాగే గాజుర్లంక-ఏ ప్రాంతంలో 4.9 హెక్టార్లు, గాజుర్లంక-బి ప్రాంతంలో 4.9 హెక్టార్లు సిద్ధంగా ఉందన్నారు. ఆ ప్రాంతాల్లో తవ్వడానికి అధికారికంగా అనుమతులు రావాల్సి ఉందన్నారు. వాల్టా చట్టం ఆధారంగా పర్యావరణ అనుమతులను పరిశీలించాలన్నారు. భూగర్భ జలాల సముతుల్యత పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇసుక రేవులు ఉన్న ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఉంచాలన్నారు. వాటిని ఇంటర్నెట్ ద్వారా కలెక్టరేట్ కు అనుసందానించాలన్నారు. భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక లభ్యత జిల్లాలోని ఇసుక రేవుల వద్ద ఉందని కలెక్టర్ చెప్పారు. వాటిని చట్టబద్ధంగా వినిపించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారి బి రామచంద్ర, భూగర్భ జల శాఖ ఏడి సురేష్, డి.టి.ఓ పరంధామరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్ఈ అనంతరాజు, కమిటీలోని ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
