డైనమిక్ న్యూస్, వినుకొండ, నవంబర్ 15
ప్రతి కుటుంబంలో పర్యావరణ స్పృహ, పరిశుభ్రత అనేవి కేవలం అలవాటు కాకుండా పరంపరగా మారాలని వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. భావితరాలకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలంటే పరిశుభ్రత అత్యంత అవసరమని పేర్కొన్నారు.
పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
వినుకొండ–కారంపూడి రోడ్డులోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర, ‘మన పరిశుభ్రత–మన ఆరోగ్యం’ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జీవీ ఆంజనేయులు విద్యార్థులు, సిబ్బందితో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.
“వైసీపీ పాలనలో చెత్త పన్ను… 80 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థం”
గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన, వైసీపీ పాలనలో చెత్తపై పన్నులు వేయడమే కాదు, 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎక్కడివక్కడే వదిలి వెళ్లిపోయారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రావడంతో చెత్త పన్నును రద్దు చేయడమే కాక, వారు వదిలివెళ్లిన చెత్తను కూడా తొలగించామని అన్నారు.
ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర
ఆరోగ్యం కోసం పరిశుభ్రత కీలకమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
పాఠశాలల ద్వారా చిన్నారి నుంచే పరిశుభ్రతపై అవగాహన పెంపొందిస్తామని చెప్పారు.
“పచ్చని, పరిశుభ్రమైన రాష్ట్రం లక్ష్యం”
ప్రతి కార్యాలయం, రోడ్లు, ప్రజాస్థలాల్లో పరిశుభ్రతే ప్రతిచోటా కనబడాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. కాలుష్య నివారణకు ప్రతి పౌరుడు తోడ్పడాలని, తద్వారా ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన, పచ్చని రాష్ట్ర నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.
“స్వర్ణాంధ్ర కోసం సీఎం చంద్రబాబు కృషి”
సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా రూపుదిద్దుకొనే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను, అందులో భాగంగా వినుకొండను ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
