నల్లగొండ బ్యూరో, డైనమిక్, నవంబర్ 17
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 28 మంది అర్జీదారుల సమస్యలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్వయంగా వినిపించారు. ప్రతి ఫిర్యాదు పై వివరాలు తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు చేరువగా పోలీసింగ్ లక్ష్యం
ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడం, పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రజలు నమ్మకంగా పోలీసులను సంప్రదించేలా వాతావరణం సృష్టించడం తమ ముఖ్య ధ్యేయమని అన్నారు.
పారదర్శక ఫిర్యాదు వ్యవస్థ – ప్రత్యేక విభాగం ఏర్పాటు
జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణకై ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నామని, ఫిర్యాదుల పరిష్కారం పై అధికారుల పనితీరును దగ్గరుండి పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఫిర్యాదుదారులకు భరోసా కల్పిస్తున్న పోలీసులు
గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఫిర్యాదుదారునికీ భరోసా ఇవ్వడంతో పాటు, పరిష్కారం వరకు పోలీసు శాఖ తమతో ఉందన్న నమ్మకం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు.
