నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 8
జిల్లా పోలీసు శాఖలో ముఖ్యమైన విభాగంగా పని చేస్తున్న హోంగార్డ్ సిబ్బంది సంక్షేమానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
హోంగార్డ్ సిబ్బంది సమస్యలపై ఎస్పీ దర్బార్
జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దర్బార్‌లో ఎస్పీ పాల్గొని, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విధుల నిర్వహణలో ఉన్న ఇబ్బందులు, వేతనాలు, అలవెన్సులు, ఆరోగ్య సమస్యలపై సిబ్బంది అభిప్రాయాలను తీసుకున్నారు.
పోలీసులతో సమానంగా సేవలు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా పోలీస్ శాఖలో అంతర్భాగమైన హోంగార్డ్ సిబ్బంది పోలీసులతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, నేరనిరోధక చర్యలు, ప్రజల భద్రత వంటి విధుల్లో హోంగార్డ్ సేవలు ప్రశంసనీయం అని కొనియాడారు.
హోంగార్డ్ వ్యవస్థ చరిత్రను గుర్తు చేసిన ఎస్పీ
1946 డిసెంబర్ 6న స్వచ్ఛందంగా ప్రారంభమైన హోంగార్డ్ వ్యవస్థ నేడు పోలీసు విభాగంలో కీలక భాగమై శాంతి భద్రతల పరిరక్షణలో తన సేవలను అందిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.
సంక్షేమ పథకాలు – రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
హోంగార్డ్ సిబ్బంది సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని ఎస్పీ తెలిపారు. రోజువారీ వేతనం ₹921 నుండి ₹1000కి పెంపు పరేడ్ అలవెన్సు ₹100 నుండి ₹200కి పెంపు యూనిఫామ్ అలవెన్సు ₹7,500విధి నిర్వహణలో మరణించిన సిబ్బందికి ₹5 లక్షల ఎక్స్‌గ్రేషియాఇవి హోంగార్డ్ సంక్షేమానికి తీసుకున్న ముఖ్యమైన చర్యలని వివరించారు.
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
ప్రతి హోంగార్డ్ తమ విధులను అంకితభావంతో, క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. విధులతోపాటు ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
అధికారులు, సిబ్బంది పాల్గొనడం
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్‌బీ డీఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌బీసీఐ రాము, హోంగార్డ్ ఆర్‌ఐ శ్రీను, అడ్మిన్ ఆర్‌ఐ సంతోష్, ఎం.టి ఆర్‌ఐ సూరపు నాయుడు, ఆర్‌ఎస్‌ఐ శ్రావణి, హోంగార్డ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.
