డైనమిక్,సూర్యాపేట బ్యూరో, నవంబర్ 1
సూర్యాపేట జిల్లా రూరల్ పరిధిలోని టేకుమట్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదకర ప్రాంతాలు, రోడ్డు భద్రతా చర్యలను పరిశీలించడానికి వచ్చిన జిల్లా పోలీసు అధికారి నరసింహ రైతులను పలకరించి వారితో ముచ్చటించారు.
రైతులతో ఆత్మీయంగా ముచ్చటించిన ఎస్పీ
రైతులు ధాన్యం ఆరబెడుతున్నప్పుడు అక్కడికి చేరుకున్న నరసింహ వారిని పలకరించి, ఆత్మీయంగా మాట్లాడారు. వారి కష్టసుఖాలను తెలుసుకుని స్వయంగా ధాన్యాన్ని రాశిపోసి సహకారం అందించారు. ఈ సందర్భంగా తాను రైతు కుటుంబం నుండి వచ్చిన వాడినని, వ్యవసాయంపై ఎప్పటినుంచో మమకారం కలిగి ఉన్నానని తెలిపారు.
రైతులకు పలు సూచనలు
వ్యవసాయంలో మంచి రకమైన విత్తనాలను ఉపయోగించి నాణ్యమైన దిగుబడి సాధించాలని, ధాన్యం అమ్మకాల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని ఎస్పీ నరసింహ సూచించారు. వ్యవసాయం ఒక పునాదిలాంటి వృత్తి అని, దానిని గౌరవంగా కొనసాగించాలన్నారు.
రైతుల మనసులు గెలుచుకున్న ఎస్పీ
రైతుల మధ్య సరళంగా, ఆప్యాయంగా మాట్లాడిన నరసింహ ప్రవర్తన రైతులను ఆకట్టుకుంది. పోలీసు అధికారి కంటే ఒక రైతు సోదరుడిగా వ్యవహరించిన ఆయనను చూసి రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

అధికారులతో కలసి పరిశీలన
ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, ప్రత్యేక శాఖ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్‌ఐ బాలు నాయక్ తదితరులు ఉన్నారు.
