Monday, March 2, 2026
Homeతాజా సమాచారంప్రతి నెల 100కు పైగా మొబైల్ ఫోన్లు రికవరీ చేస్తున్న జిల్లా పోలీసులు ఈ నెలలో...

ప్రతి నెల 100కు పైగా మొబైల్ ఫోన్లు రికవరీ చేస్తున్న జిల్లా పోలీసులు ఈ నెలలో రూ.20 లక్షల విలువైన 102 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత సి.ఈ.ఐ.ఆర్ ద్వారా ఇప్పటివరకు 2,340 మొబైల్ ఫోన్ల రికవరీ రైతులు, ప్రజలు సైబర్ మోసాలకు గురికాక అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచన

సూర్యాపేట బ్యూరో, నవంబర్ 11 , డైనమిక్

జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ కె.నరసింహ  ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 102 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసి, సంబంధిత బాధితులకు స్వయంగా అందజేశారు.

“సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు” – ఎస్పీ నరసింహ మాట్లాడుతూ

ఈ సంవత్సరం ఏడవసారి మొబైల్ రికవరీ మేళా నిర్వహించామని, ఇప్పటి వరకు ఈ పోర్టల్ ద్వారా 2,340 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి యజమానులకు అందించామని తెలిపారు.మంగళవారం రూ.20 లక్షల విలువైన 102 మొబైల్స్‌ను బాధితులకు అందించామని చెప్పారు.ఈ ఫోన్లను వివిధ రాష్ట్రాల నుంచి గుర్తించి తెప్పించామని, ఈ విజయంలో పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న సైబర్ వారియర్స్ కృషి ఉన్నదని తెలిపారు.

“మొబైల్ లోని సమాచారం మన ఆస్తి లాంటిదే”

ఎస్పీ నరసింహ ప్రజలకు సూచిస్తూ, మొబైల్ ఫోన్ కోల్పోయినా కేవలం పరికరం మాత్రమే కాదు, అందులోని విలువైన వ్యక్తిగత సమాచారం కూడా కోల్పోతామని గుర్తుచేశారు. బ్యాంకు వివరాలు, పాస్‌వర్డులు, సోషల్ మీడియా ఖాతాలు, వ్యక్తిగత చిత్రాలు వంటి సమాచారం రక్షణ చాలా ముఖ్యం అని చెప్పారు.మొబైల్ పోయిన వారు వెంటనే సి.ఈ.ఐ.ఆర్ వెబ్‌సైట్ (www.ceir.gov.in) లో వివరాలు నమోదు చేయాలని, ఫోన్‌ను బ్లాక్ చేయడం ద్వారా దుర్వినియోగం నివారించవచ్చని సూచించారు. రెండవ చేతి మొబైల్ కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు.

పోలీసు సేవలను గుర్తించాలి”

పోలీసులు ప్రజల ప్రాణాల రక్షణతో పాటు ఆస్తుల రక్షణలోనూ అంకితభావంతో పనిచేస్తున్నారని ఎస్పీ అన్నారు. “పోలీసులు మన కోసమే ఉన్నారు” అనే భావనతో పోలీసు కృషిని గుర్తించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

“రైతులు సైబర్ మోసాలకు గురికాక జాగ్రత్త”గా ఉండాలి

పంటకాలం నేపథ్యంలో రైతులను లక్ష్యంగా చేసుకుని “ధాన్యం డబ్బులు వేస్తాం, వివరాలు చెప్పండి” అంటూ సైబర్ మోసగాళ్లు మోసం చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. రైతులు అపరిచితుల ఫోన్లకు స్పందించవద్దని, బ్యాంకు వివరాలు, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు.“తక్కువ వడ్డీతో రుణాలు, తక్కువ సమయంలో అధిక లాభాలు, బహుమతులు” అంటూ మోసం చేసే వారిని నమ్మవద్దని, అలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఆర్థిక నష్టం తప్పించుకోవాలని సూచించారు.

“ధాన్యం రోడ్లపై ఆరబెట్టవద్దు”

రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరగే అవకాశం ఉందని, రైతులు ధాన్యం రోడ్లపై ఆరబెట్టకూడదని ఎస్పీ చెప్పారు. ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి అని గుర్తుచేశారు.

“పోలీసు శాఖకు ధన్యవాదాలు”

రికవరీ అయిన మొబైల్ ఫోన్లు పొందిన బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. పోయిన ఫోన్లు తిరిగి దొరకవని భావించిన సమయంలో, జిల్లా పోలీసులు టెక్నాలజీ సహాయంతో రికవరీ చేసినందుకు ఎస్పీ కి, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఐటీ కోర్ సిబ్బంది సేవలను అభినందించిన ఎస్పీ

జిల్లాలో సి.ఈ.ఐ.ఆర్ అప్లికేషన్ ద్వారా మొబైల్ రికవరీలో కృషి చేసిన ఐటీ కోర్ బృందాన్ని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ నరసింహ అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, ఐటీ కోర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments