Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంమున్సిపాలిటీల్లో ఓటర్ జాబితా అభ్యంతరాలపై క్షేత్రస్థాయి పరిష్కారం అధికారులకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్...

మున్సిపాలిటీల్లో ఓటర్ జాబితా అభ్యంతరాలపై క్షేత్రస్థాయి పరిష్కారం అధికారులకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, జనవరి 6

మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటర్ జాబితాపై స్వీకరించిన పిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వెంటనే పరిష్కరించి, ఖచ్చితమైన తుది ఓటర్ జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.

గుర్తింపు పొందిన పార్టీలతో సమీక్ష సమావేశం

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందితో ఓటర్ జాబితా తయారీపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

141 వార్డులలో ముసాయిదా జాబితా ప్రచురణ

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల పరిధిలోని 141 వార్డులలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముసాయిదా ఓటర్ జాబితాను సిద్ధం చేసి, జనవరి 1న వార్డు వారీగా ప్రకటించామని తెలిపారు.ఈ ముసాయిదా జాబితాపై ఇప్పటికే రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించామని, వాటిని వెంటనే పరిష్కరించి ఈనెల 10వ తేదీన తుది ఓటర్ జాబితా ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

ఒకే కుటుంబ ఓట్లు ఒకే వార్డులో ఉండాలి

ఓటర్ జాబితాలో నమోదు అయిన ఓటర్ల నివాస చిరునామా ప్రకారం ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే వార్డులో వచ్చేలా వార్డు విభజన, మ్యాపింగ్ తదితర అంశాలను వార్డు స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సక్రమంగా రూపొందించాలని కలెక్టర్ సూచించారు. అలా చేస్తే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

అదనపు కలెక్టర్ సూచనలు

అదనపు కలెక్టర్ కె. సీతారామరావు మాట్లాడుతూ, 1 అక్టోబర్ 2025 నాటి ఓటర్ జాబితాను ఆధారంగా తీసుకొని ముసాయిదా ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించిందని తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించి, ఖచ్చితమైన ఓటర్ జాబితా రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.ఏ.ఎస్.డి (ఆబ్సెంట్, షిఫ్టింగ్, డెత్) జాబితాను తదుపరి అందజేస్తామని తెలిపారు.

రాజకీయ పార్టీల అభ్యంతరాలపై తక్షణ చర్యలు

కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, బీజేపీ ప్రతినిధులు చల్లమల నరసింహ, హబీద్, బీఆర్‌ఎస్ ప్రతినిధులు లవకుశ, సత్యనారాయణ, సీపీఎం ప్రతినిధి గోపి సూర్యాపేట మున్సిపాలిటీ ఓటర్ జాబితాపై పలు అభ్యంతరాలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
అలాగే హుజూర్నగర్ మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ జాబితాపై సైదా నాయక్ అభ్యంతరాలు తెలిపారు. వీటన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

సమావేశంలో పాల్గొన్నవారు

ఈ సమావేశంలో బీజేపీ నుంచి హబీద్, సి.హెచ్. నరసింహ, కాంగ్రెస్ నుంచి చకిలం రాజేశ్వరరావు, సీపీఐ నుంచి బి. వెంకటేశ్వర్లు, బీఎస్పీ నుంచి రాంబాబు, బీఆర్‌ఎస్ నుంచి సవరాల సత్యనారాయణ, లవకుశ, సీపీఎం నుంచి కోట గోపి, వైఎస్సార్‌సీపీ నుంచి డేగల రమేష్, హుజూర్నగర్ నుంచి గెల్లి రవి, సైదా నాయక్ పాల్గొన్నారు.మున్సిపల్ కమిషనర్లు హనుమంత రెడ్డి, రమాదేవి, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, మున్వర్ ఆలీ, సి సెక్షన్ సూపర్డెంట్ సంతోష్ కుమార్, డీటీ వేణు, మున్సిపల్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments