Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంవిద్యార్థుల తరగతి గదిలోకి ‘జిల్లా కలెక్టర్’ —ఉపాధ్యాయుడిగా మారిన తేజస్ నంద్ లాల్ పవార్ విద్యార్థుల...

విద్యార్థుల తరగతి గదిలోకి ‘జిల్లా కలెక్టర్’ —ఉపాధ్యాయుడిగా మారిన తేజస్ నంద్ లాల్ పవార్ విద్యార్థుల ప్రతిభ చూసి ఫిదా అయిన కలెక్టర్ ఉపాధ్యాయుల బోధనకు ప్రశంసలు

సూర్యాపేట బ్యూరో,డైనమిక్ , అక్టోబర్ 28

చదువంటే ప్రేమ. విద్యార్థులంటే అభిమానం. ఇవే లక్షణాలు వున్నటువంటి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ని ఇతర అధికారుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.జిల్లాలో అభివృద్ధికి చదువే మూలమని, భవిష్యత్తు తరాల ప్రగతికి విద్యే దారిదీపమని ఆయన విశ్వసిస్తారు. అందుకే ఎక్కడ పర్యటనకు వెళ్లినా పాఠశాలలను తప్పక సందర్శిస్తారు. విద్యార్థులను కలుసుకొని, వారి అభ్యసన సామర్థ్యాలను స్వయంగా అంచనా వేస్తారు. ఆ సందర్భాల్లో ఆయన ఒక కలెక్టర్ మాత్రమే కాదు — ఒక ఉపాధ్యాయుడుగా మారిపోతారు.

రామన్నగూడెం పాఠశాలలో స్ఫూర్తిదాయక దృశ్యం

మంగళవారం ఆయన జాజిరెడ్డిగూడెం మండలం, రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో అడుగుపెట్టగానే 4, 5వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మమేకమయ్యారు.
వారితో ఇంగ్లీష్ పాఠాలు చదివించి, తెలుగులో అర్థాలు చెప్పమన్నారు. గణితంలో సంకలనం, వ్యవకలనం, గుణాంకాలపై ప్రశ్నలు అడిగి, బోర్డు వద్దకు పిలిచి లెక్కలు చేయించారు.ఒక నిజమైన ఉపాధ్యాయుడిలా ప్రతి విద్యార్థి నోట్‌బుక్‌ను తీసుకుని పరిశీలించిన ఆయన, పిల్లల చక్కని హస్తకళ, సరైన సమాధానాలు, స్పష్టమైన ఆలోచనలకు ఆశ్చర్యపోయారు.
విద్యార్థుల ప్రతిభ చూసి సంతోషం వ్యక్తం చేస్తూ వారికి బహుమతులు, నోట్‌బుక్స్, పెన్నులు అందజేశారు.

“ఉపాధ్యాయులంటే ఇలా ఉండాలి”

విద్యార్థుల స్థాయిని చూసి కలెక్టర్ ఉపాధ్యాయులను అభినందించారు.ఉపాధ్యాయుల పనితీరు విద్యార్థుల చదువులోనే ప్రతిబింబిస్తుంది. మీరు పిల్లలకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. అదే నిజమైన బోధన. ఎప్పటికీ ఇలాగే బోధించి మంచి పేరు తెచ్చుకోండి” అని ఉపాధ్యాయులు ధర్మయ్య, నీరజ, సుధారాణి, వెంకన్న లను ప్రశంసించారు. ఆయన అభిప్రాయం ప్రకారం విద్యార్థుల్లో పునాది స్థాయి నుండే చదవడం, రాయడం, గణితం, ఇంగ్లీష్ వంటి విషయాలపై పట్టు ఉండాలి.అప్పుడే ఉన్నత తరగతుల్లో విజయం సాధించగలరని ఆయన నమ్మకం.

చదువు అభివృద్ధికి మూలం – కలెక్టర్ విజన్

తేజస్ పవార్ విద్యారంగాన్ని జిల్లాలో ప్రాధాన్యంగా తీసుకున్నారు.ప్రతి పాఠశాల పర్యటనలో విద్యార్థుల అభ్యసన స్థాయిని పరీక్షించి, ఉపాధ్యాయులకు తగిన మార్గదర్శకాలు ఇస్తారు. బాగా చదివే పిల్లలను ప్రోత్సహించడమే కాకుండా, బలహీనంగా ఉన్న విద్యార్థులకు అదనపు సాయం అందేలా చర్యలు సూచిస్తారు. “పాఠశాలల్లో చదువులోనే అభివృద్ధికి విత్తనం వేయాలి. పిల్లలకు బలమైన పునాది కల్పిస్తేనే వారు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడతారు” అనే ఆయన అభిప్రాయాన్ని ప్రతి చర్యలో కనిపిస్తోంది.

ప్రజల మనసులు గెలుచుకున్న కలెక్టర్

ఆయన అధికారిగా కాకుండా, విద్యను ప్రేమించే ‘గురువు’గా ప్రజల మనసులు గెలుచుకున్నారు అని చెప్పవచ్చు.జిల్లాలో ఆయన పర్యటన అనగానే ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.“కలెక్టర్ క్లాస్‌లోకి వస్తే ఒక పెద్ద పరీక్ష రాయాలన్న ఉత్సాహం ఉంటుంది” అని విద్యార్థులు చెబుతున్నారు.

ప్రజల స్పందన

తేజస్ నంద్ లాల్ పవార్ వంటి అధికారులు జిల్లాలో ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల విద్యా నాణ్యత తప్పక మెరుగుపడుతుంది. ఆయన విద్యపై చూపిస్తున్న నిబద్ధత, ఉపాధ్యాయులను ప్రోత్సహించే దృక్పథం, విద్యార్థులతో మమేకమయ్యే తీరులు – ఇవన్నీ ఒక పరిపూర్ణ ప్రజా సేవకుడి లక్షణాలు.ప్రతి జిల్లాలో ఇలాంటి కలెక్టర్లు ఉంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థకు కొత్త ఊపు వస్తుంది. ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు

పర్యటనలో ఉన్న అధికారులు

కలెక్టర్ వెంట డి.ఎస్.ఓ మోహన్ బాబు, డి.ఇ.ఓ రాము, తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్.ఐ శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు ధర్మయ్య, ఉపాధ్యాయులు నీరజ, సుధారాణి, వెంకన్న పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments