నల్గొండబ్యూరో, జనవరి 6, డైనమిక్ న్యూస్
రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు మున్సిపాలిటీ ఎన్నికలను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
మున్సిపల్ కమిషనర్లతో సంసిద్ధత సమావేశం
మంగళవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓటరు జాబితా పునఃపరిశీలన తప్పనిసరి
మున్సిపల్ ఓటరు జాబితాపై ఫిర్యాదులు రాకుండా వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకమైన తుది జాబితాను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.ఒకే కాలనీలోని ఓట్లు రెండు లేదా మూడు వార్డుల్లో విభజించబడిన చోట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రముఖుల పేర్లు తప్పిపోకుండా చూడాలని సూచించారు. ఓటరు జాబితా పూర్తిస్థాయి పరిశీలన అనంతరం ఈ నెల 8వ తేదీ లోపు వెరిఫికేషన్ నివేదిక సమర్పించాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు
పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్తు, దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్‌చైర్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు
మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎస్‌ఎస్‌టి, ఎఫ్‌ఎస్‌టి, వీడియో వ్యూయింగ్, ఆడిట్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ముందుగానే గుర్తించి నిర్ణయించాలని తెలిపారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
పోలీస్ శాఖ సహకారంతో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
సిబ్బంది శిక్షణ, పోలింగ్ సామగ్రి సిద్ధం
మాస్టర్ ట్రైనర్లను గుర్తించి ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ సహా అన్ని ఎన్నికల సామగ్రిని సమగ్రంగా పరిశీలించాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు సయ్యద్ ముసాబ్ అహ్మద్, మల్లేశం, శ్రీనివాస్, రామదుర్గారెడ్డి, సుదర్శన్, దండు శ్రీనివాస్, ఎన్నికల విభాగం డీటీ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
