Tuesday, March 3, 2026
Homeతాజా సమాచారంఉచిత చేప పిల్లల పంపిణీ విజయవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ఉచిత చేప పిల్లల పంపిణీ విజయవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట బ్యూరో, డైనమిక్, నవంబర్ 12

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులు, సొసైటీ సభ్యులకు సూచించారు.బుదవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పంచాయతీ రాజ్, ఇరిగేషన్, వ్యవసాయ, మత్స్యశాఖ అధికారులు మరియు సొసైటీ సభ్యులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మత్స్యశాఖ ద్వారా చేప పిల్లల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.

4.40 కోట్ల రూపాయల వ్యయంతో చేప పిల్లల పంపిణీ

కలెక్టర్ వివరించిన ప్రకారం—

పులిచింతల, యాతవాకిళ్ల రిజర్వాయర్లకు 37.99 లక్షల పెద్ద చేప పిల్లలు,186 శాశ్వత చెరువులకు 2.02 కోట్ల పెద్ద చేప పిల్లలు,431 సీజనల్ కుంటలకు 97.67 లక్షల చిన్న చేప పిల్లలు మొత్తం 3.38 కోట్ల చేప పిల్లలను 4.40 కోట్ల రూపాయల వ్యయంతో ఉచితంగా పంపిణీ చేయనున్నారు.కట్ల (బొచ్చ), రోహు (మోష్), మృగాల (గడ్డిచెప) జాతుల చేప పిల్లలను పంపిణీ చేయనున్నారు.

చెరువుల్లో నీటి స్థాయి తప్పనిసరి

చేప పిల్లలు వేయడానికి ముందు చెరువులు కనీసం మూడో వంతు నీరుతో నిండి ఉండాలని కలెక్టర్ సూచించారు.నీరు తక్కువగా ఉన్న చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేయరాదని తెలిపారు.
నీరు కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చేప పిల్లల పంపిణీకి ఒక రోజు ముందుగానే సొసైటీ సభ్యులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

ప్రతి చెరువు, రిజర్వాయర్‌కు ప్రత్యేక కమిటీలు

చేప పిల్లల పంపిణీ పర్యవేక్షణ కోసం ప్రతి రిజర్వాయర్, శాశ్వత చెరువు, సీజనల్ కుంట పరిధిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.కమిటీ ఆధ్వర్యంలోనే చేప పిల్లలను పంపిణీ చేయాలని, వాటి పరిమాణం, బరువులను లెక్కించి సభ్యుల సంతకాలతో రికార్డులు ఉంచాలని సూచించారు.

టి – మత్స్య యా-ప్‌లో వివరాలు అప్లోడ్ చేయాలి

చేప పిల్లల పంపిణీ పూర్తయ్యాక వివరాలను టీ మత్స్య యాప్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.చేప పిల్లలు విడుదల చేసే సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు.జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడేలా చూడాలి

చేప పిల్లల పెంపకం ద్వారా మత్స్యకారుల జీవనాధారం బలపడుతుందని,జిల్లా ప్రజలకు పోషకాహారం అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.అధికారులు, సొసైటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి చేప పిల్లలు సజీవంగా ఎదిగేలా చూడాలని సూచించారు.

సమీక్షలో పాల్గొన్న అధికారులు

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి బి. నాగులు నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments