డైనమిక్ న్యూస్, గుంటూరు, నవంబర్ 16
మధుమేహం ఉన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులు ఇతరుల కంటే ముందుగానే, ఎక్కువ శాతంలో ప్రబలు తాయని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ షేక్ మౌలాలి హెచ్చరించారు. రక్తంలో చక్కెరని మాత్రమే నియంత్రణలో ఉంచుకోవడం సరిపోదని, గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
“మధుమేహం ఒక్క అవయవానికి మాత్రమే కాదు… శరీరమంతటికీ వ్యాపించే వ్యాధి”
ఆదివారం బ్రాడీపేటలోని ఎస్‌హెచ్‌ఓ మీటింగ్ హాల్లో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హైపర్‌టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ‘గుండెజబ్బుల శాస్త్రీయ అవగాహన సభ–ఉచిత వైద్య సలహా శిబిరం’లో ఆయన ప్రసంగించారు.సభకు డాక్టర్ టీ. సేవ కుమార్ అధ్యక్షత వహించారు.
డాక్టర్ మౌలాలి మాట్లాడుతూ,
మధుమేహం మల్టీ సిస్టమ్ వ్యాధి, అన్ని అవయవాలపై దీని ప్రభావం ఉంటుంది.అయితే గుండె మాత్రమే ప్రత్యేకమైనది; సమస్యలు వచ్చినప్పుడు హఠాత్తుగా మరణించే అవకాశం ఉంది.ఎక్కువకాలం మధుమేహం ఉన్నవారు ఈసీజీ సాధారణంగా వచ్చినా గుండె రక్తనాళాల్లో మార్పులు ఉండే ప్రమాదం అధికం
అని వివరించారు.
రక్తనాళాల సన్నబాటు – గుండెపోటుకు ప్రధాన కారణం
రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నవారిలో రక్తనాళాలు క్రమంగా సన్నబడతాయని, రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు సంభవిస్తుందని తెలిపారు.
“షుగర్ నియంత్రణతో పాటు ఆహార నియమాలు, నిత్యవ్యాయామం తప్పనిసరి” అని ఆయన సూచించారు.మధుమేహ బాధితులకు గుండెపోటు వచ్చినప్పుడు తీవ్రమైన నొప్పి కనిపించకపోవడం వల్ల ప్రమాదం పెరుగుతుందని, చిన్న లక్షణాలైనా గమనించి వెంటనే వైద్యుడిని సంప్రదించాలని హెచ్చరించారు.
“మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రతి అవయవానికి నష్టం” – అధ్యక్షుడు సేవ కుమార్
సభాధ్యక్షులు డాక్టర్ టీ. సేవ కుమార్ మాట్లాడుతూ,
మధుమేహం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పటికే బాధితులైనవారు శరీరంలోని ప్రతి అవయవాన్ని కాపాడుకునేలా జీవనశైలిని మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
“గుండెజబ్బుల పెరుగుదలకు మధుమేహమే మూల కారణం” – టి. ధనుంజయ రెడ్డి
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మెడికల్ క్యాంప్స్ చైర్మన్ టి. ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ,
ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజూ కొంత సమయం కేటాయించడం ఇప్పుడు ప్రతి వ్యక్తికి తప్పనిసరి అవసరమైందని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ చల్లా చైతన్య, ఎస్‌హెచ్‌ఓ మేనేజర్ పి. నిర్మల రాణి, మానవతా సేవా సంస్థ సభ్యులు మేకల రామారావు, ఎన్. సాంబశివరావు, డి. సాంబిరెడ్డి పాల్గొన్నారు.
