నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 18
సిపిఐ పార్టీ వందవ వార్షికోత్సవాలు మరియు ఈ నెల జరుగనున్న ప్రచార జాతాకు సంబంధించి నేరేడుచర్లలో విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు తెలిపారు. మంగళవారం వాల్ రైటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులను ఆయన ఉద్దేశించి మాట్లాడారు.
ప్రతి గ్రామంలో పార్టీ లక్ష్యాల ప్రచారం అవసరం
కరపత్రాలు, వాల్ రైటింగ్, కళారూపాలు వంటి పద్ధతుల ద్వారా గ్రామాలు, మారుమూల పల్లెలు, గిరిజన తండాల్లో సిపిఐ 100వ వార్షికోత్సవ సభల ఉద్దేశం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.పార్టీ నేతలు చేసిన త్యాగాలను యువతకు వివరించి, వారిని ప్రజాసంఘాల్లో సభ్యులుగా చేర్చుకొని పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని ధనుంజయ నాయుడు పిలుపునిచ్చారు.
బీజేపీ వాగ్దానాలు అమలు కాలేదని ధనుంజయ నాయుడు విమర్శ
2014లో బీజేపీ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు.కుటుంబాలకు ₹15 లక్షలు,రైతుల ఆదాయం రెట్టింపు,ధరలు తగ్గింపు,రెండు కోట్ల ఉద్యోగాలు,50కి పెట్రోల్–డీజిల్,వంటి హామీల్లో ఏదీ అమలు చేయలేదని అన్నారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టి వరుసగా అధికారంలో నిలబడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణలో పెడుతున్నారని ఆరోపణ
ఎల్‌ఐసి, బ్యాంకులు, టెలికాం, గనులు, రక్షణ రంగ పరిశ్రమలను కూడా ప్రైవేటీకరణ చేసి దేశ సంపదను కార్పొరేట్ వర్గాలకు అప్పగిస్తున్నారని ఆయన విమర్శించారు.దీంతో సంపన్నులు మరింత సంపన్నులవుతూ పేదలు మరింత ఇబ్బందులు పడుతున్నారని, రైతులు–కార్మికులను పెట్టుబడిదారుల బానిసలుగా మార్చే చట్టాలను సిపిఐ వ్యతిరేకిస్తోందని చెప్పారు.
నేతలు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యం, మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ A. లక్ష్మి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బండి శ్రీనివాస్, ఎస్కే హజరత్ తదితరులు పాల్గొన్నారు
