నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 20
నల్గొండలో నూతనంగా నిర్మించిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) డివిజనల్ కార్యాలయాన్ని గురువారం కేంద్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు.
కోవిడ్ సమయంలో ఆకలిబాధ నివారణకు చారిత్రక నిర్ణయం
కేంద్ర మంత్రి మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో ఒక్కరూ ఆకలితో చనిపోకుండా 80 కోట్ల పేదలకు నెలకు 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ పథకాన్ని 2030 వరకు కొనసాగించాలనే నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారని చెప్పారు.ప్రపంచంలోని ఆస్ట్రేలియా, జర్మనీ, యూరోపియన్ దేశాల్లో సైతం ఇంత భారీ స్థాయిలో పేదలకు ఆహారం పంపిణీ చేయడం లేదని, భారత ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ప్రపంచ బ్యాంకు సైతం భారత ఆహార భద్రత పథకాన్ని ప్రశంసించినట్లు వివరించారు.
రైతుల ఖాతాల్లో రూ.2.25 లక్షల కోట్లు
ధాన్యం సేకరణపై మాట్లాడిన మంత్రి రెండు కోట్లు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దేశవ్యాప్తంగా సేకరిస్తున్నామని, ప్రస్తుతం 915 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం దేశంలో ఉందని తెలిపారు.
2023–24 సంవత్సరంలో రైతుల ఖాతాలకు నేరుగా రూ.2.25 లక్షల కోట్లు జమ చేసినట్టు వెల్లడించారు.టెలంగాణకు ప్రతినెల 1.11 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు — అందులో 1 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3370 మెట్రిక్ టన్నుల గోధుమలు — కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం అన్ని రేషన్ కార్డులు డిజిటలైజేషన్ చేశామని వెల్లడించారు.
నల్గొండ ఎఫ్‌సీఐ గోదాంలో 62 వేల మె.ట. సామర్థ్యం
నల్గొండ జిల్లా ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రంలో ముందంజలో ఉందని మంత్రి చెప్పారు. నూతన ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయం ఆవరణలో ఉన్న గోదాంలో 62 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని తెలిపారు.
ప్రభుత్వం భూమి కేటాయిస్తే మరొక ఎఫ్‌సీఐ గోదాం కూడా ఈ జిల్లాలో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
తేలంగాణకు రావాల్సిన బకాయిల విడుదల
కోవిడ్ సమయంలో ప్రజా పంపిణీ పథకానికి సంబంధించిన రూ.343 కోట్ల సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.
సిఎంఆర్ డెలివరీకి సంబంధించిన పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.1400 కోట్లు కూడా రాష్ట్రం సరైన రికార్డులు సమర్పిస్తే పరిశీలించి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు డిమాండ్లు
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ —
2024–25 సంవత్సరానికి బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని పెంచాలని,పెండింగ్‌లో ఉన్న రూ.1400 కోట్ల సీఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని,సబ్సిడీ రూ.343 కోట్లు విడుదల చేయాలని,2024–25 ఖరీఫ్ సీఎంఆర్ డెలివరీ కాలాన్ని 60 రోజులు పెంచాలని,యాసంగి సీజన్‌ను 120 రోజులకు పొడిగించాలని కోరారు.రాష్ట్రంలో 8800 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటికే ధాన్యం కొనుగోలుకు రూ.29 వేల కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. ఆహార భద్రత కింద ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు.
జిల్లాకు బత్తాయి కోల్డ్ స్టోరేజ్ అవసరం
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ —
నల్గొండ బత్తాయి పంటకు ప్రసిద్ధి కావడంతో జిల్లాలో 2500 మె.ట.ల సామర్థ్యం కలిగిన బత్తాయి కోల్డ్ స్టోరేజ్‌ను మంజూరు చేయాలని కోరారు.
అలాగే ధాన్యానికి ప్రైవేట్–ప్రభుత్వ భాగస్వామ్యంతో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.





ఇతర ప్రముఖుల పాల్గొనడం
పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, ఎఫ్‌సీఐ ఈడీ వనిత శర్మ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఎఫ్‌సీఐ జిల్లా మేనేజర్ రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
