డైనమిక్,వినుకొండ, అక్టోబర్ 24
కల్తీ మద్యం లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, కల్తీ మద్యం ఘటనలను పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడానికి ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్‌ను తీసుకొచ్చిందన్నారు. ఏ స్థాయిలో వ్యక్తులైనా కల్తీ మద్యాన్ని ప్రోత్సహించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి వినుకొండ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఆర్.కె. మద్యం దుకాణాన్ని సందర్శించి యాప్ గురించి అవగాహన కల్పించారు. లైసెన్సుదారులు సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి విక్రయిస్తున్నారా..? యాప్‌లో వివరాలు నమోదవుతున్నాయా లేదా అని పరిశీలించారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులకు యాప్ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నకిలీ మద్యం నిర్మూలనలో భాగంగా అన్ని మద్యం దుకాణాలు, బార్లలో కొత్తగా రూపొందించిన యాప్ ద్వారా పరీక్షించి అమ్మకాలు జరుపుతారని అన్నారు. వినియోగదారులు సురక్ష యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దాని ద్వారా మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి అసలుదా? నకిలీదా? తెలుసుకోవచ్చన్నారు. వినియోగదారులకు నాణ్యమైన మద్యం అందజేయడం, కల్తీ లేకుండా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కల్తీ మద్యాన్ని నియంత్రించడానికి, నాణ్యత, పారదర్శకం చేయడానికి ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింద్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే మద్యం అమ్మకాలు చేపట్టాలన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారిందని, విపరీతమైన ధరలతో అక్రమ దందా కొనసాగిందన్నారు. ఐదేళ్లు లిక్కర్ మాఫియా నడిపి రూ.3,500 కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు. అవినీతి సంపాదన కోసం ప్రజల ప్రాణాలను బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తులసివనంలో ఓ గంజాయి మొక్క లాగా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట పనికిమాలిన వ్యక్తులు కల్తీ మద్యం విక్రయించే ప్రయత్నాలు చేస్తారని, వాటిని చూస్తే ఉపేక్షించబోమని, వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగన్ పాలనలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది పేదల ప్రాణాలు పోతే కనీసం విచారణ కూడా జరపకుండా కేసును తప్పుదారి పట్టించి ఎవరిపై చర్యలు తీసుకోలేదన్నారు. వైసీపీ పాలనలో తెలంగాణ నుంచి నాటుసారా తీసుకొచ్చి మాచర్లలో విక్రయించినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అవినీతి సొమ్ము కోసం నాసిరకం మద్యం సరఫరాతో రాష్ట్రంలో 32 వేలమంది ప్రాణాలు కోల్పోయారని, 30 లక్షలమంది అనారోగ్యపాలయ్యారని చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీని అనారోగ్యాంధ్రప్రదేశ్‌గా చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ మద్యాన్ని అరికట్టి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
