హైదరాబాద్,డైనమిక్ డెస్క్, అక్టోబర్ 21
కర్తవ్య నిర్వాహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. పోలీసు అమరవీరుడి కుటుంబానికి సీఎం ఎ. రేవంత్ రెడ్డి సానుభూతి వ్యక్తం చేస్తూ, పలు ఉపశమన చర్యలను ప్రకటించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రమోద్ కుటుంబానికి రూ.1 కోటి రూపాయల నష్టపరిహారం అందించనున్నట్లు సమాచారం. అదనంగా, పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.8 లక్షలు, పోలీస్ భద్రతా సంక్షేమ నిధి నుంచి రూ.16 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నారు.ఇక అమరవీరుడి కుటుంబానికి 300 గజాల ఇల్లు స్థలం కేటాయింపుతో పాటు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు.పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తుండగా ప్రాణాలు కోల్పోయిన ప్రమోద్ త్యాగం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఆయన కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.“పోలీసులు ప్రజల రక్షణ కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. వారి త్యాగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది,” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.సర్కార్ ఈ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు స్వాగతిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలకు ఇది ప్రోత్సాహకరంగా నిలుస్తుందని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు.
