🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 October 2026, 3:31 pm Posted by : DAINAMIC NEWS

ప్రణాళికాబద్ధమైన దర్యాప్తుతోనే బాధితులకు సత్వర న్యాయం కేసులను సకాలంలో పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ కె. నరసింహ

News Image
ముఖ్యమైన పాయింట్స్:ప్రణాళికాబద్ధమైన దర్యాప్తుతోనే బాధితులకు సత్వర న్యాయంకేసులను సకాలంలో పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట బ్యూరో , అక్టోబర్ 10, శుభోదయ డైనమిక్ వార్త:

కేసుల దర్యాప్తులో పటిష్ఠ ప్రణాళికతో ముందుకు సాగుతూ, చట్ట నిబంధనలను పాటించి నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎస్పీ పలు సూచనలు చేశారు. కేసుల నమోదు నుంచి దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేసే వరకు ప్రతి దశలోనూ నిర్దిష్ట ప్రణాళికతో పనిచేయాలని తెలిపారు. కేసుల స్వభావం, తీవ్రతను బట్టి వర్తించే చట్టపరమైన కాలపరిమితులకు అనుగుణంగా 60, 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.నేరాల దర్యాప్తులో డిజిటల్ సాక్ష్యాలను సమర్థవంతంగా సేకరించి, భద్రపరిచి, చట్టబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. సాక్ష్య పోర్టల్‌ను సమర్థంగా ఉపయోగించుకోవడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో నాట్‌గ్రిడ్ వంటి సాంకేతిక వ్యవస్థలను నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకోవాలన్నారు. బాధితుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా, నిబంధనల ప్రకారం ఇంటి వద్ద నుంచే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, అవసరమైన సందర్భాల్లో జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

దర్యాప్తులో ఉన్న కేసులను నిరంతరం సమీక్షిస్తూ, జాప్యం లేకుండా పరిష్కరించాలని ఎస్పీ సూచించారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో చార్జిషీట్లను సకాలంలో దాఖలు చేయడంతో పాటు, కోర్టులకు అవసరమైన రికార్డులను నిర్ణీత సమయంలో పంపించాలని తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ పురోగతిని సమీక్షిస్తూ సాక్షుల హాజరు, రికార్డుల సమర్పణ, దర్యాప్తు అధికారుల సమన్వయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.నాణ్యమైన దర్యాప్తుతో నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఈ-చలానా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, మద్యం సేవించి వాహనాలు నడిపేవారితో పాటు మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీఆర్బీ డీఎస్పీ రవి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ మగ్దుమ్ అలీ, ఐటీ ఎస్‌ఐ సాయిరామ్, డీసీఆర్బీ ఎస్‌ఐ ఝాన్సీ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు మహేందర్‌నాథ్, ఐలయ్య, గోపీకృష్ణ, కోర్టు డ్యూటీ సిబ్బంది, పోలీస్ స్టేషన్ రైటర్లు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home