🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 2:33 pm Posted by : DAINAMIC NEWS

ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు తప్పక పాటించాలి: ఎస్పీ నరసింహ

News Image
ముఖ్యమైన పాయింట్స్:దసరా, బతుకమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలిప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు తప్పక పాటించాలి: ఎస్పీ నరసింహ
దసరా, బతుకమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి

ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు తప్పక పాటించాలి: ఎస్పీ నరసింహ

సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్ న్యూస్, అక్టోబర్ 4

దసరా, బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ సూచించారు. పండుగల సందర్భంగా ప్రజలు, యువత, ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించి భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు.

గొడవలకు తావులేకుండా ఉత్సవాలు
ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఎలాంటి ఘర్షణలకు అవకాశం ఇవ్వకూడదన్నారు. అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేయకుండా, తక్కువ శబ్దంతో కూడిన సౌండ్‌ సిస్టమ్‌ మాత్రమే వినియోగించాలని సూచించారు. అనుమతి లేని లక్కీ డ్రాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు.

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దు
రోడ్లపై ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మండపాల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరి
దుర్గామాత మండపాల ఏర్పాటుకు సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు సురక్షిత విద్యుత్‌ వైరింగ్‌, నాణ్యమైన విద్యుత్‌ పరికరాలను మాత్రమే ఉపయోగించాలన్నారు. అవసరమైన చోట బారికేడ్లు ఏర్పాటు చేసి కమిటీ సభ్యులు అందుబాటులో ఉండాలని తెలిపారు.

బతుకమ్మ వేడుకల్లో మహిళలకు భద్రత
బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలకు తగిన సౌకర్యాలు, భద్రత కల్పించాలని సూచించారు. సంప్రదాయ పూలతోనే బతుకమ్మలను తయారు చేయాలని, రసాయనాలు కలిపిన పూలను నీటిలో వేయకుండా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు తప్పక పాటించాలన్నారు.

నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలి
వర్షాభావ పరిస్థితులు, నీటి వనరులపై ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని నీరు, విద్యుత్‌ను వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని ఎస్పీ సూచించారు. పండుగల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

“పండుగ మనందరిది – ఆనందం, ఐక్యత, భద్రత మన బాధ్యత” అనే సందేశంతో దసరా, బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసులకు ప్రజలు, యువత, ఉత్సవ కమిటీలు సహకరించాలని ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ కోరారు.

🏠 Home