🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 10:41 am Posted by : DAINAMIC NEWS

చిట్టీలు, అధిక రాబడుల పేరుతో కోట్ల మోసం ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భార్య అరెస్ట్

News Image
ముఖ్యమైన పాయింట్స్:చివ్వెంల పోలీస్‌స్టేషన్ పరిధిలో చిట్టీలు, డెయిలీ కలెక్షన్లు, అధిక రాబడుల పేరుతో ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు


📌 శుభోదయ డైనమిక్ న్యూస్ – సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 4


చివ్వెంల పోలీస్‌స్టేషన్ పరిధిలో చిట్టీలు, డెయిలీ కలెక్షన్లు, అధిక రాబడుల పేరుతో ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

2015 నుంచి చిట్టీలు, డెయిలీ కలెక్షన్లు

చివ్వెంల మండలం యెనగండి తండాకు చెందిన బానోత్ రాజు (44) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తన భార్య బానోతు అనూష (33) సహకారంతో 2015 నుంచి చిట్టీలు, డెయిలీ కలెక్షన్లు నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు.

అధిక రాబడులు ఇస్తామంటూ భారీగా వసూళ్లు

అధిక రాబడులు, నెలవారీ చెల్లింపులు ఇస్తామని నమ్మించి ప్రజలు, తోటి ఉద్యోగులు, పరిచయస్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. భూములు కొనుగోలు చేస్తున్నామని నమ్మించి పలువురి నుంచి నగదు తీసుకున్నట్లు కూడా దర్యాప్తులో తేలిందన్నారు.

రూ.6.24 కోట్లకు పైగా నగదు సేకరణ

చిట్టీల గడువు పూర్తయినప్పటికీ డబ్బులు తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు బాధితుల నుంచి రూ.6,24,50,000 సేకరించినట్లు, అందులో రూ.3,18,54,000 తిరిగి చెల్లించినట్లు తెలిపారు. ఇంకా రూ.3,05,96,000 బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు.

500–600 మందికి అధిక వడ్డీకి రుణాలు

సేకరించిన మొత్తంలో కొంత భాగాన్ని వ్యక్తిగత అవసరాలు, ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు, మిగిలిన మొత్తాన్ని సుమారు 500–600 మందికి రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు నెలకు 10 శాతం వరకు అధిక వడ్డీకి అప్పుగా ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు.

ఇతర బాధితులు పోలీసులను సంప్రదించాలి

ఈ వ్యవహారంలో ఇంకా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే తమ వద్ద ఉన్న ఆధారాలతో వెంటనే చివ్వెంల పోలీసులను సంప్రదించాలని పోలీసులు సూచించారు. అధిక రాబడులు, చిట్టీలు, పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.కేసులో ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బాండ్లు, భూముల లావాదేవీలు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన సూర్యాపేట రూరల్ సీఐ జి. రాజశేఖర్, ఎస్‌ఐలు వి. మహేష్, వెంకన్న, సిబ్బంది జనార్దన్ రెడ్డి, వెంకటేష్లను అధికారులు అభినందించారు.
🏠 Home