స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చారిత్రాత్మకం అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేరేడుచర్లలో మూడు మండలాల లబ్ధిదారులకు కార్డుల పంపిణీ
నేరేడుచర్ల, సెప్టెంబర్ 27, శుభోదయ డైనమిక్ వార్త
నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకీడు మండలాల ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నేరేడుచర్లలోని ఎస్‌కేఎస్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించారు. తహసీల్దార్ సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌరసరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మకం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా అందిస్తున్నామని చెప్పారు.
83 లక్షల కొత్త రేషన్ కార్డులు
గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యుల పేర్లను చేర్చలేదని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం దాదాపు 83 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా భద్రత, పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు.
గ్రామాల్లో పండుగ వాతావరణంలో పంపిణీ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని చారిత్రాత్మక కార్యక్రమంగా పేర్కొన్న మంత్రి, ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం మూడు మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం
కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రతి నాయకుడు, కార్యకర్తకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. దీంతో కార్యక్రమానికి హాజరైన నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు
అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బీజేపీపై రాజకీయ విమర్శలు చేశారు. దేశంలో ఓటు చోరీ, అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు దేశ ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నాయని పేర్కొన్నారు.
పిల్లుట్ల రఘుపై పరోక్ష వ్యాఖ్యలు
హుజూర్‌నగర్‌లో వార్డు స్థాయిలో కూడా విజయం సాధించని వారు తన గురించి మాట్లాడుతున్నారని పేర్కొంటూ మంత్రి పరోక్షంగా పిల్లుట్ల రఘుపై వ్యాఖ్యలు చేశారు.
పలువురు అధికారులు, నాయకుల హాజరు
కార్యక్రమంలో అగ్రికల్చర్ కమిటీ సభ్యులు చెవిటి వెంకన్న,పెఱిక సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఆర్డీఓ శ్రీనివాస్, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ సందీప్‌రెడ్డి, కమిషనర్ నాగరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్‌రెడ్డి, చిల్లేపల్లి మాజీ పీఏసీఎస్ చైర్మన్ అనంతు శ్రీనివాస్‌గౌడ్, పాలకీడు మాజీ ఎంపీపీ గోపాల్‌నాయక్, మాజీ జెడ్పీటీసీ మోతిలాల్‌నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు, గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఆంజన్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ చరమంద రాజు, నేరేడుచర్ల ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి, పాలకీడు ఎస్‌ఐ కోటేష్, గరిడేపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్, కోదాడ ఎస్‌ఐ అంజిరెడ్డితో పాటు అధికారులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.