🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 August 2026, 11:50 pm Posted by : DAINAMIC NEWS

నాగార్జునసాగర్‌లో ఆగస్టు 10న మహా వరుణ యాగం సీఎం రేవంత్ రెడ్డి హాజరు.. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు

News Image

హైదరాబాద్ , శుభోదయ డైనమిక్ డెస్క్, ఆగస్టు 7




రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణా–గోదావరి నదులు జలకళతో కళకళలాడాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో మహా వరుణ యాగాన్ని నిర్వహించనుంది. ఆగస్టు 10న సోమవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున ఉన్న విజయ విహార్ ఆవరణలో ఈ యాగం వైభవంగా జరగనుంది. యాగంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొననున్నారు.




యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో యాగం.. ముమ్మర ఏర్పాట్లు




యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహా వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు. దేవస్థాన పాలక మండలి ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ యాగాన్ని నిర్వహించడం విశేషంగా మారింది. యాగం నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే అధికారులు, దేవస్థాన ప్రతినిధులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. యాగంలో 108 మంది ఋత్వికులు, వేద పండితులు, అర్చక బృందం పాల్గొని 11 హోమగుండాల్లో వేదమంత్రోచ్చారణల మధ్య యాగాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 3.20 గంటల నుంచి 3.24 గంటల మధ్య పూర్ణాహుతి నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించారు.




ఎల్‌నినో ప్రభావం తొలగాలని సంకల్పం




రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ఎల్‌నినో ప్రభావం తొలగిపోయి ప్రజలు సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో ప్రభుత్వం ఈ మహా వరుణ యాగాన్ని నిర్వహిస్తోంది. కృష్ణా, గోదావరి నదుల్లో సమృద్ధిగా జలప్రవాహం కొనసాగి అన్ని ప్రాజెక్టులు నిండాలని యాగంలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. రైతాంగానికి అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొని వ్యవసాయం అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.




సాగర్‌లో డెడ్ స్టోరేజ్.. సాగునీటిపై దృష్టి




రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెరిగినప్పటికీ, శ్రీశైలం నుంచి ఇంకా నాగార్జునసాగర్‌కు ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో జలాశయం ప్రస్తుతం డెడ్ స్టోరేజ్‌లోనే ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నాగార్జునసాగర్ కింద సుమారు 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన నేపథ్యంలో రైతాంగ శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ మహా వరుణ యాగంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

🏠 Home