🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 July 2026, 8:39 am Posted by : DAINAMIC NEWS

నేరేడుచర్ల మండల తొలి సమీక్షా సమావేశం ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం కావాలి – ప్రత్యామ్నాయ పంటలే రైతులకు రక్షణ VDG RAMG జలసిరి పనులు వేగవంతం చేయాలి – ప్రత్యేక అధికారి వి. మోహన్‌బాబు

News Image

నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త,జూలై 28




డ్రిప్ సిస్టమ్‌కు 90 శాతం సబ్సిడీ.. రైతులు వినియోగించుకోవాలి: వ్యవసాయ అధికారి జావేద్




నేరేడుచర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల తొలి సమీక్షా సమావేశం ప్రత్యేక అధికారి వి. మోహన్‌బాబు అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరై శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి వి. మోహన్‌బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా VDG RAMG జలసిరి పనులను గ్రామాల్లో వేగవంతం చేసి వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.




ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి




సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి జావేద్ ఎల్‌నినో వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం సూపర్ ఎల్‌నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే వర్షపాతం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు అధిక నీటి అవసరమయ్యే వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచించారు.




మెట్ట పంటల సాగుతో నష్టాలను తగ్గించుకోవాలి




వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు కందులు, జొన్నలు, శనగలు వంటి మెట్ట, ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. అలాగే తక్కువ నీటితో మంచి ఆదాయం అందించే ఆయిల్‌పామ్ తోటల సాగు కూడా లాభదాయకమని వివరించారు.




డ్రిప్ సిస్టమ్‌కు 90 శాతం సబ్సిడీ




నీటి వనరులను సమర్థంగా వినియోగించేందుకు డ్రిప్ ఇరిగేషన్ విధానం అత్యంత ఉపయోగకరమని పేర్కొన్న జావేద్, డ్రిప్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీటి పొదుపుతో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.




జలసిరి పనుల పురోగతిపై సమీక్ష




VDG RAMG జలసిరి పథకం కింద ప్రతి గ్రామంలో చేపడుతున్న ఫామ్‌పాండ్లు, ఫిష్‌పాండ్లు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు, సోక్‌పిట్లు, పర్కొలేషన్ ట్యాంకులు, చెక్‌డ్యామ్‌లు, వర్షపు నీటి సంరక్షణ పనుల పురోగతిని సమావేశంలో సమీక్షించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.




అన్ని శాఖల పనితీరుపై సమగ్ర సమీక్ష




విద్యుత్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం, పశుసంవర్ధక, వైద్య ఆరోగ్యం, విద్య తదితర శాఖల ప్రగతిపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అందుతున్న సేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు. సమావేశంలో అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను సమర్పించి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ సోమ సుందర్ రెడ్డీ, ఎంపీవో నాగరాజు,ఏపీ ఓ శేఖర్, వెట్నర్ డాక్టర్ నరేష్, పీహెచ్ సి డాక్టర్ నాగిని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు అధికారులు పాల్గొన్నారు

🏠 Home