🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 April 2026, 12:30 am Posted by : DAINAMIC NEWS

హుజూర్ నగర్‌లో 24/7 మద్యం బెల్ట్ షాపుల దందాకుటుంబాలపై తీవ్ర ప్రభావం – అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు

News Image

హుజూర్ నగర్,శుభోదయ డైనమిక్, ఏప్రిల్ 18




పట్టణంలో అక్రమ మద్యం బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పెరిగిపోతూ సామాజిక సమస్యగా మారుతున్నాయి. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బును మద్యం కోసం ఖర్చు చేస్తూ అనేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




నిబంధనలు గాలికొదిలిన పరిస్థితి




పట్టణంలో ఉన్న వైన్స్ షాపులు, బార్లకు నిర్ణీత సమయాలు ఉన్నప్పటికీ బెల్ట్ షాపులు మాత్రం 24 గంటలు నిరభ్యంతరంగా నడుస్తున్నాయి. ప్రభుత్వం విధించిన నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.




అధిక ధరలకు మద్యం విక్రయం




బెల్ట్ షాపుల్లో ప్రతి క్వార్టర్‌పై అదనంగా రూ.40 వరకు, బీరు సీసాలపై రూ.30–40 వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల సాధారణ ప్రజలు మరింతగా నష్టపోతున్నారు.




కల్తీ మద్యం – ప్రాణాలకు ముప్పు




కొన్ని చోట్ల కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇది ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. కొందరు ఇండ్లలోనే ఫ్రిడ్జ్‌లతో మద్యం నిల్వ చేసి అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిసింది.




స్కూళ్లు, ఆస్పత్రుల వద్ద కూడా విక్రయాలు




నిబంధనల ప్రకారం విద్యాసంస్థలు, ఆస్పత్రుల సమీపంలో మద్యం అమ్మకాలు నిషేధం ఉన్నప్పటికీ, హుజూర్ నగర్‌లో ఆ నిబంధనలు అమలు కావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.




ఎక్సైజ్ శాఖపై ఆరోపణలు




బెల్ట్ షాపులపై పూర్తి సమాచారం ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు దాడులు చేయడంలో విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే నామమాత్ర చర్యలు తీసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.




ప్రత్యేక రోజుల్లో భారీ దందా




గాంధీ జయంతి, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో వైన్స్ షాపులు మూసివేసిన సమయంలో బెల్ట్ షాపులు లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.




ప్రభుత్వం జోక్యం అవసరం




ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

🏠 Home